ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని చూస్తున్నారా..? అయితే.. మీరు నిత్యం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సిందే. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే అనారోగ్య సమస్యలు చాలా వస్తాయట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. పలువురు సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే అలాంటి వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సక్రమంగా ఉండక చివరకు డయాబెటిస్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే మహిళలకు డయాబెటిస్ వచ్చే అవకాశం 20 శాతం వరకు ఉంటుందట. ఇక క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసే వారి బరువు నియంత్రణలో ఉండి, వారు ఆరోగ్యంగా ఉంటారట. అలాగే బ్రేక్‌ఫాస్ట్ చేయని వారు బాగా ఆకలిలో ఉండి రోజులో తరువాత తినే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటారట. దీంతో బరువు పెరుగుతారట.
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే దాని ప్రభావం శరీర పనితీరుపై కూడా పడుతుందట. ముఖ్యంగా జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆకలిలో ఉన్నప్పుడు చాలా మందికి సాధారణంగా కోపం, చిరాకు వస్తుంటాయి. దీన్నే హ్యాంగ్రీ అని అంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం, చాలా సమయం వరకు ఆకలితో ఉండడం తదితర అంశాలు మన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయట. ఇక బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల నాలుకపై ఎక్కువగా బ్యాక్టీరియా చేరి నోరు దుర్వాసన వస్తుందని, అదే సమయానికి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే తద్వారా నోట్లో లాలాజలం ఉత్పత్తి అయి నాలుకపై ఉండే బ్యాక్టీరియా పోతుందని, నోరు దుర్వాసన రాకుండా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక తెలిసింది కదా.. రోజూ కచ్చితంగా టైముకు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మరిచిపోకండి..!