సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏదైనా షాప్ కి వెళ్తే సరదాగా చిలిపి దొంగతనం చేస్తుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులు మొట్టికాయ వేస్తే అర్థం చేసుకుని ఇంకోసారి చేయకుండా ఉంటారు. కానీ ఓ యువతి ఏకంగా పటిష్ఠ నిఘా ఉన్న షాపింగ్ మాల్ లో ఓ చాక్లెట్ చోరీ చేసింది. కానీ అక్కడి సిబ్బందికి దొరికిపోయింది. చివరకు డబ్బు చెల్లించి క్షమాపణ కోరి బయటకు వచ్చేసింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన ఈనెల 29న చోటుచేసుకుంది.
ఆ ఫుటేజీ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి ఇరుగుపొరుగు, స్నేహితులు, నెట్టింట్లో కామెంట్లు చూసి అవమానం భరించలేక మనస్తాపానికి గురై ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దూర్ జిల్లా జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ పల్లి ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ షాపింగ్ మాల్ ఎదుట నిరసనకు దిగారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.