ఆంధ్రప్రదేశ్ ఆర్దిక రాజధాని, సాగర తీరం విశాఖలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. అక్కడ ఒక కంపెనీ లో గ్యాస్ లీక్ కావడంతో వేలాది మంది ప్రజలు ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అక్కడికి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం ఆగిపోయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే గ్యాస్ లీక్ అవ్వడంతో వెంటనే స్పందించిన యువత వ్రుద్దులను, మహిళలను, చిన్న పిల్లలను వేగంగా ఆస్పత్రులకు తరలించడమే కాకుండా ఊరు దాటించారు. తమకు అందుబాటులో ఉన్న వాహనాలతో వారి ప్రాణాలను కాపాడారు.
అత్యంత వేగంగా అధికారుల కంటే వేగంగా స్పందించి ప్రజలను తరలించారు. దాదాపు పది కిలోమీటర్ల పరిధి దాటి వారిని తరలించారు. తమ వద్ద ఉన్న వాహనాలతో పదుల సంఖ్యలో జనాన్ని ఒక్కొక్కరు ఊరు దాటించడమే కాకుండా అపస్మారక స్థితిలో ఉన్న వారిని వేగంగా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించే విధంగా తమ వంతు సహాయ సహకారం అందించారు. సొంత కార్లు, లారీలు, ఇతర వాహనాలతో తరలించారు.