వైసీపీ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న కాపు లకు వరాలు ప్రకటించింది. ఎన్నికలకు ముందు నుంచి కూడా కాపులు జగన్‌పై ఆశలు పెట్టుకున్నారు. వారికి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో జగన్‌సాయం చేస్తారని అనుకున్నారు. కానీ, ఇది కేంద్రంతో ముడిపడిన వ్యవహారం, రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నందున తాను చేయలేనని జగన్ కుండబద్దలు కొట్టారు.
అయితే, దీనిని అప్పటి అధికార పార్టీ టీడీపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. తామే కాపులను ఉద్దరిస్తున్నామని పేర్కొంది. వారికి అనేక రూపాల్లో మేళ్లు చేస్తున్నామని తెలిపింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కాపులకు ఏం చేశారో.. అసెంబ్లీ లోనే జగన్ వివరించి తప్పులు ఎత్తి చూపించారు. కాపులను కూడా చంద్రబాబు ఓటుబ్యాంకు రాజకీయా లకు వాడుకున్నారని విమర్శించారు.
ఇక, ఇప్పుడు తాను చేయాల్సింది చేస్తానని చెబుతూనే.. కాపు కార్పొరేషన్ ను పునరుద్ధరించి, ఏడాదికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. అన్నదే తడువుగా.. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేటాయింపు చేశారు. తాజాగా.. కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
అది కూడా కేవలం 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు. తాజా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
ఈ పథకానికి రూ.1101 కోట్లు కోటాయించడం తెలిసిందే. ఇక కాపుల్లో 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇది ఒకరకంగా కాపు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మరి కాపు నాయకులు ఇప్పటికైనా సంతృప్తి వ్యక్తం చేస్తారో చేయరో చూడాలి.