ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో మంత్రుల్లో గుబులు మొదలైంది. సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో అధికారులు, మంత్రులు తమ పనిని సక్రమంగా చేసుకుంటూ పోతున్నారు. లేకుంటే మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతారని గ్రహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం తన నిర్ణయాలను ఎప్పటి కప్పుడు సమీక్ష చేసుకుంటు తనదైన పంథాలో పరిపాలన సాగిస్తున్నారు.
అయితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో స్వయంగా సీఎం కేబినేట్లోని మంత్రుల్లోనే గుబులు మొదలైంది.. గుబులు అంటే అట్లాంటి ఇట్లాంటి గుబులు కాదు.. ఎప్పుడు సీఎం వద్ద నుంచి పనితీరు బాగాలేదని పదవికి రాజీనామా చేయమంటారో అనేంత గుబులు ప్రారంభమైంది. అందుకు ఆస్కారం ఇచ్చేలా సీఎం జగన్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మంత్రుల్లోనే గుబులు రేగుతుంది.. అవినీతికి పాల్పడినా, విధుల్లో అలసత్వంగా ఉన్నా, పరిపాలనలో చురుకుదనం లేకున్నా, పార్టీ పరంగా వీక్‌గా కనిపించినా, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేసినా ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మంత్రులకు ఝలక్ ఇచ్చి నిరూపించారు.
సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నానీలకు భారీ ఝలక్ ఇచ్చారు. ఏకంగా వారిని జిల్లాలకు ఇన్‌చార్జీ మంత్రులుగా బాధ్యతల నుంచి తప్పించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ 13 జిల్లాలకు ఇన్‌చార్జీ మంత్రులను గతంలోనే నియమించారు. అందులో కొందరికి అవకాశం రాలేదు. కొడాలి నానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లకు ఇన్‌చార్జీ మంత్రులుగా అవకాశం రాలేదు.. వీరితో పాటుగా కొందరు మహిళా మంత్రులకు కూడా అవకాశం ఇవ్వలేదు.
అయితే అవకాశం వచ్చిన ఈ ముగ్గురి వ్యవహరశైలీ బాగా లేకపోవడం, జిల్లాలపై పట్టు లేకపోవడం, ఎమ్మెల్యే మద్య సమన్వయం చేయడంలో విఫలం కావడం, కొందరిపై ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన నివేధికల ఆధారంగా వీరిని ఇన్‌చార్జీ మంత్రుల నుంచి తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే సీఎం జగన్ మంత్రుల పనితీరుపై నిత్యం నివేధికలు తెప్పించుకుంటూ పనితీరును సమీక్షించుకుంటున్నారట. ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ మంత్రుల పనితీరును పరిశీలిస్తున్నారట. ఈ ముగ్గురిని ఇన్‌చార్జీ మంత్రుల నుంచి తప్పించడంతో మిగతా మంత్రుల్లో గుబులు మొదలైందనే చెప్పవచ్చు.
ఎందుకంటే సీఎం జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే కొన్ని షరతులు విధించాడు. ఆ షరతులు వర్తిస్తాయి కనుక తమ పనితీరునే గీటురాయిగా చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రులనే మార్చిన సీఎం జగన్ ఎన్నడైనా మంత్రి పదవుల నుంచి కూడా తొలగించే అవకాశం లేకపోలేదు.. అందుకే ఇకముందు ఈ మంత్రులు తన పనితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు, తమ పద్దతులు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకుంటే ఇక అంతే సంగతులు. సీఎం జగన్ తప్పు చేస్తే మంత్రులను కూడా వదలడు అనే సంకేతాలు ఇచ్చాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.