ఏపీ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ లు ఈ అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరో పక్క కేంద్ర కాబినెట్ సెక్రటరీకి ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు.
ఎన్నికల కమిషనుకు ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామని కేంద్రానికి లేఖలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నా, కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనమని చెబుతున్నారని పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వండి ఆయన కోరారు. ఒకవేళ నిజంగా కేంద్రం తమ ఉద్యోగులను పంపడానికి సిద్దం అయితే పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.