వారసత్వం అనేది బందుత్వం బట్టి, రక్తసంబంధం బట్టి మాత్రమే వస్తుందని అనుకోవడం అజ్ఞానం అని మరోసారి నిరూపించే పనికి పూనుకున్నారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! తాను అధికారం చేపట్టినప్పటినుంచి సంక్షేమమే పరమావధిగా పాలనసాగిస్తున్నారు జగన్. దీనికి సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వైఎస్సార్ ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్.
అప్పట్లో ఫీజు రీ ఎంబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, మొదలైన పథకాలతో తనకంటూ, తన పాలనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి పద్దతిలోనే జగన్ మరింత దూకుడుగా, మరింత మెచ్యూర్ గా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో… నందమూరి తారకరామారావు ఆదర్శాలకు సైతం జగన్ వారసుడిగా పాలిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మధ్యపాన నిషేదం అనేది అప్పట్లో ఎన్టీఆర్ ను హీరోని చేసిన నినాదాల్లో ఒకటి. దాన్ని ఆయన పదవులకు మాత్రమే వారసులుగా నిలిచిన వ్యక్తులు లైట్ తీసుకున్నారు.. సరికదా తమ పాలనలో మద్యాన్ని ఏరులై పరించారనే పేరు సంపాదించుకున్నారు. ఇదే క్రమంలో “ప్రజల ముంగిట పాలన -. ప్రజల ముంగిట ప్రభుత్వం” అంటూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నినాదం.. అప్పట్లో ఓ సంచలనం!
అనంతరం ఆ పార్టీ నుంచి పాలించిన నేతలు పేరులైతే మార్చగలిగారు.. “ప్రజలవద్దకే పాలన” అనగలిగారు కానీ… చేతల్లో అది చూపించలేకపోయారు. కానీ.. ఆ విషయంలో కూడా జగన్.. అన్నగారిని ఆదర్శంగా తీసుకుని.. ఇంటివద్దకే రేషన్ అన్న పథకాన్ని ప్రారంభించ నిర్ణయించారు!
అవినీతికి తావు లేకుండా నిత్యావసర సరుకులను పేదల ఇంటికే చేర్చడం. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జగన్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థను పక్కాగా ఉపయోగించుకుంటున్న జగన్… ఈ విషయంలో కూడా వారినే కీలకంగా చేయబోతున్నారు.
ఈ మేరకు ఈ పథకం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంక్షేమం, ప్రజారంజక పాలన, గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వంటి విషయాల్లో అటు నాన్నగారిని, ఇటు అన్నగారిని ఆదర్శంగా తీసుకుని జగన్ పాలన సాగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!