పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా… అధికార పక్షంలోకి వచ్చినా కూడా వైఎస్సార్‌సీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా మాత్రం జగన్‌పై ఎప్పుడు ఈగ వాలనీయరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆమెను నాడు అధికార పార్టీ మంత్రులు, నేతలు ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. చివరకు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన రోజా కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. గత ఎన్నికల్లో నగరి నుంచి వరుసగా రెండోసారి జయకేతనం ఎగరవేసిన రోజాకు మహిళా కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే అందరూ అనుకున్నారు.
అయితే జగన్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోజాను కేబినెట్లోకి తీసుకోలేదు. సామాజిక సమీకరణలతో పాటు అనేక కారణాలు కూడా ఆమెకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమయ్యాయి. ఎన్ని సమీకరణలు అడ్డున్నా ఆమెను కేబినెట్లోకి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని వైసీపీలో వినిపించే గుసగుసలు. పెద్దిరెడ్డి ఎంత సీనియర్ అయినా.. ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టి చిత్తూరు జిల్లాతో పాటు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా రోజా వాయిస్ ముందు ఆయన నిలబడలేరన్నదే ఎక్కువుగా వినిపించే మాట.
అప్పటి నుంచి రోజా వర్సెస్ పెద్దిరెడ్డి మధ్య కూల్‌వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగానే మండుతోంది. రోజా వీలున్నప్పుడల్లా ఏదో రూపంలో పెద్దిరెడ్డిపై చిటపటలాడుతూనే ఉంటోంది. ఇక ఇప్పుడు తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉంటోన్న నగరి మాజీ మునిసిపల్ చైర్మన్ కేజే కుమార్ సతీమణికి జగన్ ఏకంగా నామినేటెడ్ పదవి ఇచ్చారు. నగరిలో రోజాకు వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కుమార్‌కు జిల్లాకే చెందిన మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి అండదండలు ఉన్నాయన్న ప్రచారం ఉంది.
ఈ క్రమంలోనే గతంలో రోజా కూడా కేజే. కుమార్‌పై ఓపెన్‌గానే ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అదే వ్యక్తికి పదవి ఇవ్వడంతో జగన్ రోజాను లైట్ తీస్కొన్నారని.. ఈ విషయంలో పెద్దిరెడ్డి మాటకే ఓటు వేశారని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే కుమార్ భార్య శాంతిని నియమించడంపై రోజా కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. పెద్దిరెడ్డిపై తాను ఎన్ని కంప్లైంట్లు చేస్తున్నా అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రోజా రుసరుసలాడుతోందని టాక్..?రోజాకు జగన్ మార్క్ షాక్… పెద్దిరెడ్డి మంత్రాగమేగా..?
-vuyyuru subhash