ఎట్టి పరిస్థితుల్లో తమ జిల్లా పేరును మార్చేందుకు వీల్లేదని అంటూ చాలా మంది ఆందోళన కారులు రోడ్డెక్కుతూ ఉన్నారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతూ సీఎం ఇటీవల నిర్ణయం తీసుకున్న వైనం తెలిసిందే ! దీనిపై ఇప్పుడు మరిన్ని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందాల కోనసీమ పేరును అదేవిధంగా ఉంచాలని, పేరు మార్పును తాము అంగీకరించబోమని కోనసీమ ఉద్యమ సమితి పేరిట పలువురు నిన్నటి వేళ రోడ్డెక్కారు. ఓ యువకుడు అయితే ఏకంగా ఆత్మహత్యా యత్నానికి సైతం పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
నిన్నటి వేళ కోనసీమ కలెక్టరేట్ వద్దకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకుని, తమ డిమాండ్ ను వినిపించారు. ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. వాస్తవానికి రాపాక వరప్రసాదరావు(రాజోలు ఎమ్మెల్యే) వంటి నాయకుల ప్రతిపాదన మేరకే పేరు మార్చినప్పటికీ, తాము ఇందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. ఇంకొందరు తమ జిల్లాకు దివంగత నేత, స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరును పెట్టినా సంతోషించేవాళ్లమని అంటున్నారు. ఏదేమయినప్పటికీ అంబేద్కర్ పేరును తమ జిల్లాకు ఉంచడం తగదని అంటున్నారు వీరంతా! ఈ నేపథ్యంలో ధర్నాలూ, రాస్తారోకోలు జరుగుతున్నాయి. మరోవైపు పచ్చని సీమల్లో పేరు మార్పుతో వివాదాలు రాజేస్తున్నారంటూ జగన్-ను ఉద్దేశించి ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటే ఓ పెద్ద తలనొప్పి వ్యవహారంలా ఉందని, దీనికి తోడు ఇటువంటి వివాదాలు అశాంతికి కారణం అవుతాయే తప్ప ! సఖ్యతను పెంపొందింపజేయవని ఇంకొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
కులాల కుంపటి చల్లారేనా!
వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లాను పునర్విభజన పేరిట రాజమహేంద్రవరం అని, కోనసీమ అని, అల్లూరి జిల్లా అని వివిధ భాగాలుగా విభజన చేయడాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు కొందరు. ఎందుకంటే జిల్లా విభజన కారణంగా తమకు కొత్తగా ఒనగూరేదేమీ ఉండదన్నది వీరి భావన. ఇప్పటిదాకా ఉన్న సమస్యలే పరిష్కారానికి నోచుకోవడం లేదని, ఇప్పుడు జగన్ చర్యల కారణంగా అనైక్యత తప్ప ప్రాంతాల మధ్య విభేదాలు తప్ప వీటి వల్ల కొత్తగా వచ్చే అవకాశాలు ఏవీ లేవని కొందరు మండిపడుతున్నారు.
ఇప్పుడు తాజా వివాదం నేపథ్యంలో దళిత, దళితేతర వివాదంగా మార్చేందుకు కొందరు చూస్తున్నారు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించాల్సి ఉంది. కానీ ఎటు పోయినా రాజకీయంగా కానీ సామాజికంగానీ ఇబ్బందులే అన్న భావనతో జగన్ తర్జనభర్జన పడుతున్నారు. శాంతిని నెలకొల్పే చర్యలు సత్వరమే తీసుకోకుంటే మళ్లీ మళ్లీ ప్రజల మధ్య గ్రూపు తగాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.