రాజకీయాలనూ, కులాలనూ వేరుగా చేసి చూడలేని పరిస్థితి కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ భవిష్యత్తు కోసం కల్పించారనడంలో ఎలాంటి సందేహం ఉండనక్కరలేదు! ఈ క్రమంలో తనకు అలాంటి తారతమ్యాలు ఏమీ ఉండవని చెబుతూనే… సపోజ్, ఫర్ సపోజ్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి మెజారిటీ ఎస్సీ, బీసీలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైకాపా అధినేత జగన్!
ఇప్పటికే డిప్యుటీ సీఎం పదవుల్లోనేమి, మంత్రిపదవుల్లోనేమీ, నామినేటెడ్ పోస్టుల్లో అయితేనేమి జగన్ అది నిరూపించుకుంటూనే వచ్చారు! ఈ క్రమంలో బీసీలపైనా, ఎస్సీలపైనా తనకు మాములు ప్రేమ లేదని బాబు (ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే) నిత్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా… అది మాటలకే పరిమితం అవుతుందన్న విషయం ఆయన కూడా నిత్యం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు!
ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను బలిపశువును చేయడంతో… గతంలో బాబు దళితులకు ఎన్ని రకాలుగా అన్యాయం చేశారు.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు.. ఎన్ని రకాలుగా వారి ఆత్మాభిమానంతో రాజకీయ క్రీడ ఆడారు అనే విషయంపై కథనాలు వెలువడుతున్నాయి. గెలిచే అవకాశాలు శూన్యం అని తెలిసినా కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి బాబు సంపాదించింది అది!!
ఈ క్రమంలో బీసీలకు మరో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఇచ్చే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపడం ద్వారా… తనకున్న అభిమానాన్ని చెప్పకనే చెప్పిన జగన్… అత్యంత ప్రధానమైన వైకాపా పార్లమెంటరి పార్టీ పదవిని తనకు అత్యంత నమ్మకస్తుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబాబుకు ఇవ్వలనే ఆలోచన చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
ఈ రకంగా రోజు రోజుకీ ఆ సామాజికవర్గానికి తాను ఇచ్చే విలువ ఏమిటో చేతల్లో చూపిస్తూ జగన్ దూసుకుపోతుంటే… చంద్రబాబు మాత్రం వర్లను రాజ్యసభకు పోటీలో నిలబెట్టడం ద్వారా… ఆ సామాజిక వర్గాన్ని మరింత దూరం చేసుకుంటున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పటినుంచీ రోజూ ట్విట్టర్ లో బాబు, లోకేష్ లు దళితులపైనా, బీసీలపైనా తెగ ప్రేమ కురిపిస్తున్నా… అది కేవలం మాటల వరకే పరిమితం అవుతుందని.. ఇది ఆయా వర్గాలకు ఆ విషయం అర్థమయ్యి చాలాకాలమే అయ్యిందని… ఏదైనా ఓపిక ఉంటే చేతల్లో చూపించాలి కానీ.. ప్రెస్ నోట్లలోనూ, ట్వీట్లలోనూ కాదని పలువురు సూచిస్తున్నారు.