ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చిన తీరు అందరికీ తెలిసిందే. ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 151 నియోజకవర్గాల్లో ప్రజలు ఆశీర్వదించడంతో వైసీపీ ఎన్నికల్లో తన హవాను చాటుకుంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టినీ మరింత బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు గాను పార్టీ లోని ముఖ్య నేతలు వైసీపీ ట్రబుల్ షూటర్స్ గా చెప్పబడే విజయసాయి రెడ్డిని , వైవీ సుబ్బారెడ్డిని, సజ్జల రామకృష్ణా రెడ్డిని రంగంలోకి దింపారు.
ముగ్గురికీ కీలక బాద్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీనీ ప్రతీ నియోజకవర్గం పునాదుల నుండి బలోపేతం చేయాలని వారిని జగన్ ఆదేశించారు. ముగ్గురిలో ఒక్కొక్కరికీ కొన్ని జిల్లాల చొప్పున విభజించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలలోని పరిస్థితిని రిపోర్ట్ గా చేసి ఇవ్వాలని వారిని ఆదేశించారు. కాగా ఎంపీ విజయసాయిరెడ్డికీ… శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికీ… ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికీ… కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని ఆయన ఆజ్ఞాపించారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయ సాయిరెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.