ఏపీ సీఎం జగన్ కిలక నిర్ణయాలకు, సంచలనాలకు కూడా వేదికగా మారారు. ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని రికార్డు సృష్టించారు. అసలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో సాధ్యమేనా? అనే సందేహాలు కూడా తెరమీదికి వచ్చాయి. అయితే, వాటిని సాకారం కూడా చేసి చూపిస్తున్నారు. గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థను తెరమీదికి తెచ్చినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఇది అయ్యే పనికాదని, లక్షల మంది నియామకం.. సాధ్యమేనా.. వారిని ప్రజల ఇళ్లకు పంపి ప్రభుత్వ పథకాలు అందించడం కూడా సాధ్యమేనా అనుకున్నారు. అయితే, దీనిని సాకారం చేశారు.
అదేసమయంలో మద్య నియంత్రణ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుని తొలి ఏడాదిలో 20 శాతం మద్యం నియంత్రించా లని నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మరో కీలక సంచలన అడుగుగా భావిస్తున్న శాసన మండలి రద్దు విషయంలోనూ ఆయన అలాగే వ్యవహరించారు. వచ్చే ఏడాది నుంచి వైసీపీకే సంపూర్ణంగా ఉపయోగపడుతుందని తెలిసి కూడా ప్రతిపక్ష ఆధిపత్యాన్ని అందునా.. ప్రజాబలం లేని నేతల వైఖరిని ఆయన సంపూర్ణంగా పక్కన పెట్టి ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతకే పెద్దపీట వేశారు. ఇలా ప్రతి విషయంలోనూ ఊహకే అందని విధంగా ఆయన దూసుకుపోయారు.
ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి కారణమైన, కేంద్రంపై విమర్శలకు కారణమైన.. ఎన్ ఆర్ సీ కి వ్యతిరేకంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకూ ఇబ్బందిగా పరిణమించింది. ముస్లిం వర్గాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న దీనిని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పడం, అయితే, రాష్ట్రాల సానుకూలత కూడా ఉండాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం వర్గాలు రాష్ట్రాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోనూ ముస్లింలు కొన్ని రోజులుగా దీనిపై జగన్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం.. కేంద్రంతో సఖ్యతను పాటిస్తున్న జగన్ దీనిపై తాను ఎలాంటి నిర్నయం తీసుకుంటే కేంద్రం ఏం నొచ్చుకుంటుందోనని భావించారు. అయితే, రాను రాను ముస్లిం వర్గానికి చెంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం కూడా జగన్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జగన్ దీనిపై కరాఖండీగా నిర్ణయం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ ఆర్ సీకి వ్యతిరేకంగా తీర్మానం తీసుకువస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు. అదేసమయంలో ఆయన కేంద్రానికి వ్యతిరేకత కూడా కాకుండా 2010 నాటి జనాభా లెక్కల ప్రకారమే ఎన్ ఆర్ సీని పరిగణనలోకి తీసుకోవాలని జగన్ సూచించారు. మొత్తానికి ఈ పరిణామం జగన్‌కే సాధ్యమైందని, అదేస్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే.. సాధ్యమేనా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.