రాష్ట్రంలో ఎన్నికలు జరిగి దాదాపు 11 నెలలు పూర్తవుతున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీలో ఎలాంటి చర్చ జరిగిందో.. పార్టీ అధినేత జగన్‌కు నాయకులు ఎలాంటి బ్రహ్మ రథం పట్టారో.. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కొనసాగుతోంది. నిజానికి ఇలాంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీల్లో కనిపించడం చాలా చాలా అరుదు. ఎన్నికలు పూర్తయ్యాక.. మా బలంతోనే మేము గెలిచాం.. అనే నాయకులు కనీసం ఒకరిద్దరయినా కనిపిస్తుంటారు. గతంలో ఏపీని పాలించిన టీడీపీని పరిశీలిస్తే.. గెలిచిన నాయకుల్లో 50శాతం మంది ఇదే మాట అన్నారు. మేం లేక పోతే.. బాబుకు అధికారం ఎక్కడ దక్కేది? అని అన్న నాయకులు కూడా కనిపించారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి పార్టీని నాయకుల బలంతో నడిపించడమే అవుతుంది. ఇది మున్ముందు పార్టీకి మేలు చేసే పరిస్థితి పూర్తిగా తుడిచిపెట్టేలా చేస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇదే పరిస్థితి టీడీపీలో కనిపించింది. నాయకులు ఎవరికి వారు తమదే రాజ్యంగా వ్యవహరించడం, అధినేతను నామ్‌కే వాస్తేగా పరిగణించడం వల్ల పార్టీ బలం బలహీనతా అంతా కూడా నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజల్లో బలం క్షీణించి, నాయకులు చేసిన తప్పులతో పార్టీ అధికారం కోల్పోయింది.
కానీ, దీనికి భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోంది. అధినేత జగన్ కనుసన్నల్లోనే అంతా సాగుతుండడం గమనార్హం. అలాగని ఆయన డిక్టేటర్ మాదిరిగా కూడా వ్యవహరించకపోవడం గమనార్హం. ఒకవైపు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకుంటూనే.. మరోపక్క, పార్టీ నేతల్లోనూ తనపై విశ్వాసాన్ని పెంచుకునేలా చేస్తున్నారు., మనం పాలకులం కాదు.. సేవకులం అని చెప్పడం ద్వారా ప్రతి కార్యకర్తను తనవైపు తిప్పుకొనే లా చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల్లో(అధికారంలోకి రాకపోతే.. పార్టీ ఉనికికే దెబ్బకొట్టే పరిస్థితి ఉంటుందని తెలిసినా) కొత్త ముఖాలకు చోటిచ్చి గెలిపించుకోవడం జగన్ సామర్ధ్యాన్ని వెలికి తీసింది.
ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అంతా తానే అయి నాయకులను నడిపిస్తున్నారు. ఒకరిద్దరు తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వారు ఉన్నా.. వారిని వెంటనే పక్కన పెడుతున్నారు. దీంతో పార్టీ అధినేతపై నేతల్లో అచెంచల విశ్వాసం ఏర్పడింది. ఇది.. పార్టీని పది కాలాలపాటు బతికించే పరిణామం అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి తాను గెలిచి, పార్టీని గెలిపించుకున్న నాయకుడిగా వైసీపీ అధినేత రికార్డు సృష్టిస్తున్నారు.