ఏపీ సీఎం ఇపుడు గేట్లు ఎత్తేసారు.. నియమాలు.. నిబద్దత.. రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ ఇప్పుడు అవే పద్దతులు పాటిస్తూనే అన్ని గేట్లు ఏత్తేశారు. అయితే ఈ గేట్లు కూడా నియమాలతో కూడుకున్నవే.. అంతే కాదు.. ఈ గేట్లు పూర్తిగా ఎత్తేయడానికి కారణాలు కేవలం రాజకీయ కారణాలే తప్ప మరేది కాదు అనేది సత్యం.. మరి ఈ గేట్లు ఎత్తేయడంతో ఇక వరద ప్రవాహం జోరుగా సాగనుందని రాజకీయ వర్గాల కథనం.ఈ వరద ప్రవాహంలో రాజకీయ పార్టీలు మునిగిపోవడం ఖాయమేనని అంటున్నారు రాజకీయ మేధావులు. ఇంతకు సీఎం జగన్ ఏ గేట్లు ఎత్తేశారు.. వరద ప్రవాహం ఎక్కడిది.. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే రాజకీయ పార్టీలు ఏంటీవో చూద్దాం…
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు తనపార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి రాజ్యాంగబద్దంగా గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను టీడీపీలోకి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జగన్‌కు రుచించలేదు.. వాస్తవానికి పార్టీ మారిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలి. కానీ ఇక్కడ చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాజ్యాంగ నియమాలను, చట్టాలను తుంగలో తొక్కి వైసీపీ ప్రజాప్రతినిధులను అడ్డగోలుగా పార్టీలో చేర్చుకున్నారు.
అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారు. వాస్తవానికి ఓ పార్టీ కి చెందినవారిని మంత్రులుగా చేసారంటే అది సంకీర్ణ ప్రభుత్వం కింద లేక్కే.. కానీ ఇక్కడ అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రులుగా చేసి అనర్హులుగా గుర్తించకుండా స్పీకర్‌ను కేవలం రబ్బర్‌స్టాంప్‌గా మార్చుకుని చట్టాలను తుంగలో తొక్కారు. దీనిని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. నైతిక విలువలు పాటించరా అని, పార్టీపిరాయించిన వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌కు లేఖలు ఇచ్చారు. అయినా స్పీకర్ ఇవేమి పట్టించుకోలేదు.
అదే సమయంలో మేము అధికారంలోకి వస్తే మేము మీలాగా నీతి తప్పం.. నియమాలు తప్పం.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన పదవికి రాజీనామా చేసి వచ్చేవారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అలాగే తాను అధికారం చేపట్టిన రోజే జగన్ సీఎం హోదాలో హుందాగా ప్రకటించారు. మా పార్టీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన పార్టీకి రాజీనామా చేస్తేనే వైసీపీలోకి తీసుకుంటామని ప్రకటించి నైతిక విలువలకు కొత్త బాష్యం చెప్పారు. అదే మాటమీద నిలబడ్డారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరాలని అనుకున్నా సీఎం జగన్ చేసిన ప్రకటనతో వారంతా బీజేపీ బాట పట్టారు. స్థానిక నేతలు కూడా వైసీపీలో చేరాలని అనుకున్నా జగన్ ఎందుకో పార్టీలోకి వచ్చే వలసలను వద్దన్నారు.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను బలపడకుండా చేయాలంటే.. పార్టీలోకి వచ్చే నేతలను చేర్చుకోవాలని నిర్ణయించారు. తద్వారా ఇతర పార్టీలో చేరాలనుకున్నవారు ఇప్పుడు అధికార వైసీపీలో చేరుతారు.. ఇప్పుడు వైసీపీ వలసల నేతలను చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల జనసేన, టీడీపీ నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. దీంతో వలసలకు గేట్లు తెరిచినట్లైంది.. ఇక భవిష్యత్‌లో పార్టీలో చేరేవారి కోసం ఈ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయట..
అంటే ఇక వరదలా వెల్లువెత్తనున్నారట వలస నేతలు. కాకుంటే సీఎం జగన్ ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రం ఇంకా పార్టీలో చేర్చుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, తాను ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో గతంలో ప్రకటించిన విధంగానే పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తరువాతే పార్టీలో చేర్చుకుంటారు కాబోలు.. పార్టీల నేతలకు గేట్లు తెలిచినట్లుగా, ఎమ్మెల్యేలు, ఎంపీలకు గేట్లు ఎప్పుడు తెరుస్తారో వేచిచూద్దాం…