జల వివాదంలో ఏపీ ప్రయోజనాలను ప్రస్తావించడంలో జగన్ సక్సెస్ అయ్యారనే అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ఫైర్ బ్రాండ్ నేతతో నిన్న మొన్నటి వరకు స్నేహంగా ఉన్న జగన్.. అంతేకాకుండా తన వ్యాపార సామ్రాజ్యం మొత్తం హైదరాబాద్‌లో ఉంచుకుని ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. పోతిరెడ్డిపాడు ఆగకపోతే.. అలంపూర్ వద్ద మరో ప్రాజెక్టు కడతామని కేసీఆర్ హెచ్చరించారు. దీనికి సీఎం జగన్ ధీటుగా జవాబిచ్చారు. మేమెందుకు ఊరుకుంటాం.. అవసరమైతే.. మొత్తం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేస్తాం.. అని దురుసుగానే మాట్లాడినట్టు తెలిసింది.
మొత్తానికి ఈ పరిణామం చూస్తే.. రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తన మిత్రుడే అయినా.. గత ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని బలంగా కోరుకున్న నాయకుల్లో ఒకరైన కేసీఆర్‌ను సైతం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఢీ అంటే ఢీ అంటూ..ఎదిరించడం.. జగన్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సమయంలోనే కేసీఆర్‌తో విభేదించి, పైగా ఎలాంటి అన్యోన్యత, స్నేహం లేకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు గత ముఖ్యమంత్రిగా విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణానీటిని ఎత్తిపోసే.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ దీనిని విభేదించారు. ఇది పూర్తయితే.. శ్రీశైలంలో నీరు ఉండదని, ఫలితంగా సీమ జిల్లాలు మరింతగా ఇబ్బంది పడతాయని ఆయన పేర్కొన్నారు. దీక్ష కూడా చేశారు.
కానీ, చంద్రబాబు సీమ జిల్లా అయిన చిత్తూరుకు చెందిన నాయకుడే అయినా.. నలభై ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకొంటున్నా.. కేసీఆర్‌ను ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించలేక పోయారనే విమర్శలను భారీగానే పడుతున్నారు. ఏదేమైనా.. చంద్రబాబు రాజకీయ జీవితంలో నీటి పోరాటం చేయలేకపోయారనే మచ్చ మాత్రం మిగిలిపోతుందని, ముఖ్యంగా సీమ ప్రయోజనాలను ఆయన కాపాడలేకపోయారనే విమర్శలను మిగుల్చుకున్నారని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash