అడ్డొస్తే రద్దు చేయడమేనా…? శాసన సభను ఏ విధంగా మర్చిపోయారు…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టడంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు, ఆయన ప్రత్యర్ధులు ఇప్పటికీ అంటూ ఉంటారు. ఆయనకు అధికారం చాలా అవసరంతో పాటుగా చంద్రబాబుని అధికారం నుంచి దించడం బిజెపికి అత్యవసరం. అందుకే జగన్ విజయం సాధించారు. సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా భారీ అంచనాలతో అయ్యారు.

ఒక ప్రాంతీయ పార్టీకి 151 సీట్లు రావడం అనేది ఒకరకంగా సంచలనం. అంటే ఆయనపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను జగన్ ముందు నుంచి కూడా నిలబెట్టుకోలేదు. ఆయన అడుగు పెట్టిన విధానం కూడా మంచిది కాదనే వ్యాఖ్యలు ప్రజావేదిక కూల్చివేత ద్వారా స్పష్టంగా అర్ధమయ్యాయి. అక్కడి నుంచి ప్రతీ ఒక్కటి కూడా జగన్ కక్ష సాధింపు ధోరణి ద్వారానే వెళ్ళారు.

పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ ఆ పనులను ఆయన ఆపించేసారు. ఆ తర్వాత అమరావతి సహా, అన్నా క్యాంటిన్ ని కూడా ఆపించేసారు. అలాగే అనేక కార్యక్రమాలను ఆయన రద్దు చేసారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు శాసన మండలి వ్యవహారానికి వచ్చి చూద్దాం. శాసన మండలిని జగన్ రద్దు చెయ్యాలి అనుకోవడం నిజంగా ఆశ్చర్యమే.

గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తమకు మండలిలో బలం లేదని రద్దు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అసలు ఇలాంటి పరిణామం కూడా దేశంలో ఎక్కడా జరిగినట్టు కూడా లేదు. ఎప్పుడో ఎన్టిఆర్ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేసారు. అది అక్కడితో అయిపోయింది. కాని ఇప్పుడు జగన్ మాత్రం ఏ పరిస్థితుల్లో రద్దు చేయ్యాలి అనుకుంటున్నారో చూసి ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అంటే తనకు అడ్డు ఉంటే ఏదైనా సరే రద్దు చేస్తారా…? 58 మంది జీవితాలను జగన్ పణంగా పెడతారా…? వాళ్ళల్లో సుధీర్గ రాజకీయ పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నేటి రాజకీయ భాషలో మాట్లాడితే పదవుల కోసం ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. బలం లేదు కదా అని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వినలేదు.

అలాంటప్పుడు ప్రధాని కూడా రాజ్యసభను రద్దు చెయ్యాలి. కాంగ్రెస్ కి బలం ఉంది కదా అని తమ బలం పెంచుకోవాలని ఎందుకు చూస్తారు…? ఏళ్ళ తరబడి తమకు అధికారం లేని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాలను తీసుకుంటే…? త్రిపురలో 25 ఏళ్ళు వామపక్షాలు పాలించాయి, రాజస్థాన్, చత్తీస్గఢ్ లో బిజెపి దశాబ్దంకి పైగా పాలించింది.

మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకుంటే…? ఈ రద్దు నిర్ణయాలతో రాష్ట్రం అభాసుపాలు అవుతుంది గాని, రాష్ట్రానికి జరిగే లాభం ఏమీ ఉండదు. తెలంగాణలో ఎంతో బలంగా ఉన్న తెరాస కూడా ఈ ఆలోచన చేయలేదు. ఇప్పటికే జగన్ పై ప్రజల్లో అభిప్రాయం మారింది. ఇలాంటి చర్యలతో ఆయన దిగజారడం మినహా మరొక ప్రయోజనం అనేది ఎక్కడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news