“ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్న మీఅందరూ.. రెండున్నరేళ్లపాటు మంత్రులుగా ఉంటారు. అయితే, ఈ పదవీ కాలం అంతా కూడా శాశ్వతం అని అనుకోవద్దు. అవినీతికి దూరంగా లేక పోయినా.. ఆరోపణలు వ చ్చినా.. ప్రభుత్వానికి మచ్చతెచ్చే పనులు చేసినా ఎప్పుడైనా మిమ్మల్ని పక్కన కూర్చోబెడతా!“-ఇదీ ఏపీ సీఎంగా తన కేబినెట్‌ను ఉద్దేశించి ఐదు నెలల కిందట జగన్ చేసిన ప్రకటన. అప్పట్లో ఇది సంచలనం గా కూడా మారింది. దీంతో అందరు మంత్రులు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, ప్రజలకు చేరువ అవుతా రని అందరూ అనుకున్నారు.
నిజమే అలా అనుకోవడమే కాదు.. మంత్రులు ప్రజా సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు.
అయితే, తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ చేసిన ప్రకటన సంచలనానికి దారితీసింది. ఆయన ఇద్దరు కీలక మంత్రులను ఉద్దేశించి హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. “ఇద్దరు మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. నేను ఏం జరగకూడదని అనుకున్నానో.. అదే జరుగుతు న్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా మీరు మారండి. మీ పదవులు నిలబెట్టుకోండి.“- అని జగన్ అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
నిజానికి కేబినెట్ భేటీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన సమాచారం లేకుండా జగన్ ఇలా మాట్లాడి ఉంటారని అనుకోలేం. దీంతో విశ్లేషకులు .. అసలు జగన్ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టారు. కొంచెం వెనక్కివెళ్తే.. రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల ఎంపిక జరిగింది. ఈ క్రమంలోను, తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల సమయంలోనూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులు ఏకంగా తాము నాలుగు లక్షలు సమర్పించామని ఆరోపణలు రావడం గమనార్హం.
అదే సమయంలో నాణ్యమైన బియ్యం పంపిణీ విషయంలో తనకు సంబంధం లేకపోయినా.. ఓ మంత్రి జోక్యం చేసుకుని.. రైస్ మిల్లర్లకు లబ్ధి చూకూర్చారనే విషయంపై కూడా వార్తలు వచ్చాయి. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకునే జగన్ ఇలా ఆ ఇద్దరు మంత్రుల పేర్లు వెల్లడించకుండా హెచ్చరించారని అంటున్నారు. మరి ఇప్పటికైనా వారు మారతారో .. లేక జగనే మారి వారిని పక్కన పెడతారో చూడాలి.