అవినీతి, అక్రమ, లంచగొండితన రహిత పాలనే తన ధ్యేయమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. తదనుగుణంగానే ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో అంశంపై దృష్టిసారిస్తూ నివారణకు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతమాత్రం పొలిటికల్ కరప్షన్ ఉండకూడదని ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇదే విషయమై పెడచెవిన పెట్టిన ఇద్దరు ముగ్గురు మంత్రులకు పద్ధతి మార్చుకోకుంటే బాగుండదు..అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
సీఎం సీరియస్‌నెస్‌ను గమనించిన ప్రజాప్రతినిధులు పొలిటికల్ కరప్షన్‌కు దూరంగా ఉంటున్నారట. ఇంటలిజెన్స్ వారిచ్చిన నివేదికల సారాంశాన్ని కూడా సీఎం పరిగణలోకి తీసుకుని ఈ విషయంపై సంతృప్తికరంగా ఉన్నారట. అయితే అధికారుల లంచగొడితనం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని గుర్తించారట. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసినా సక్రమంగా అర్హులైన సామాన్య పౌరులకు అందాలంటే కేవలం యంత్రగంతోనే సాధ్యం.
అయితే దీనికి వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచం ఇవ్వందే పనిచేయడం లేదని ఇంటలిజెన్స్ అధికారులు రిపోర్టు ఇవ్వడం..ప్రజాప్రతినిధుల నుంచి కూడా సీఎంకు ఫిర్యాదులు అందాయట. దీంతో ఈ పరిస్థితిని మార్చకుంటే ప్రభుత్వం ఎన్ని చేసినా వృథానే అని మంత్రులతో వ్యాఖ్యనించారట. అందుకే తక్షణమే వ్యవస్థీకృతమైన లంచగొడితనంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకున్నారట.
సాధ్యమైనంత త్వరలోనే ఏసీబీ బృందాలను రంగంలోకి దించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను దొరకబట్టాలని భావిస్తున్నారట. ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులతో చర్చలు పూర్తయ్యాయని యాక్షన్ ప్లాన్‌తో త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగుతుందని తెలుస్తోంది. వీరు మారకపోతే జగనే వాళ్లను మార్చేలా వాతావరణం కనిపిస్తోంది. చూడాలి సీఎం జగన్మోహన్‌రెడ్డి లంచాన్ని అరికడతారో..!