రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో.. పాలనలో ఉన్న సమయంలోనూ అంతే స్థాయిలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అత్యంత కీలకం. ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితే, ఈ వ్యూహాలు కొన్నింటికి కలిసి వస్తాయి. మరికొన్నింటికి బెడిసి కొడతాయి. ఇప్పుడు జగన్ వ్యూహాలు కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతు న్నాయి. ఆయన పట్టుబట్టి సాధించుకున్న సీఎం పీఠంపై కూర్చున్న నాటి నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా రు. అంతేకాదు, లక్ష్యం పెట్టుకుని మరీ ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయన చెప్పిన సమయానికి, చెప్పినట్టు సదరు వ్యూహం అమలవుతోంది. దీనికి సంబంధించి జగన్ నియమించుకున్న టీమ్ కూడా సమర్ధంగా పనిచేస్తోంది. యువ నాయకు లు ఆయనకు కుడి ఎడమలుగా ఉండడం కూడా కలిసి వస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరింత భారీ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు. అదే.. జూలై 8. ఆ రోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం కనుక సక్సెస్ అయితే.. అటు సీఎంగా, ఇటు పార్టీ అధినేతగా ఆయనకు తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా చెమటలు పడతాయని అంటున్నారు.. తాజాగా జగన్ లక్ష్యాలను తెలుసుకున్న నాయకులు, విశ్లేషకులు. మరి ఇంతకీ ఈ లక్ష్యం ఏంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో తన హవాను ముందుకు తీసుకు వెళ్లాలని, రాష్ట్రం మొత్తం ఫ్యాన్ తిరగాలని జగన్ నిర్ణయించుకున్నారు.
దీనికి సంబంధించి రెండు నెలల కిందటే పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. అయితే, ఈలోగా లాక్‌డౌన్ రావడంతో ఆయన లక్ష్యాలు నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగ్గుదలను గుర్తిస్తూ.. జూలై 8 నాటికి కీలక లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని సీఎం జగన్ నిర్ణయించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో జయంతి(సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక) జూలై 8న రానుంది. ఈ క్రమంలో తన లక్ష్యం.. తండ్రి వైఎస్ ఆశయం కలిసి వచ్చేలా .. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలని భారీ లక్ష్యం నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు కార ణంగా నిర్వాసితులు అయిన పేదలకు కూడా 10 వేల మందికి ఇళ్లు పూర్తి చేసి ఆ రోజు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇక, ఆ తర్వాతే.. స్థానిక ఎన్నికలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి ఇది జరిగితే.. రాష్ట్రంలో జగన్ పేరు మార్మోగడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఆత్మరక్షణలో పడుతుందని చెబుతున్నారు. మరి జగన్ లక్ష్యం ఏమేరకు ఫలిస్తుందో.. ఆయన వ్యూహం ఈ దఫా ఎలా ఆచరణలో సక్సెస్ అవుతుందో చూడాలి.