ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఓదార్చారు.. గద్దర్ సమాధి వద్ద కాసేపు కూర్చొని ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజా గాయకుడు యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటని అన్నారు.. గద్దర్ సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేయాలని, మెదక్ లోని ఆయన స్వస్థలంలో స్మారక చిహ్నం ఏర్పాటుతోపాటు పాఠ్యాంశాల్లో ఆయన జీవిత అంశాలను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు..
విప్లవ భావాలు ఉద్యమ భావాలతో తన జీవితాన్ని గడిపిన గద్దర్ వేలాది పాటలు రాసి ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించాలని అన్నారు.. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన్ను పట్టించుకోలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గద్దర్ చనిపోయినప్పుడు ముసలి కన్నీరు కార్చారని విమర్శించారు. గద్దర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. గద్దర్ కుటుంబానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ టాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని సూచించారు. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో గద్దర్ జీవితాన్ని పొందుపర్చాలన్నారు. మెదక్ జిల్లాలోని గద్దర్ పుట్టిన గ్రామంలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.