సీఎం చెప్పిన మారని ఆ వైసీపీ నేతల తీరు..ఒకరి పై ఒకరు కేసులు

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య రాజకీయ విబేధాలతో అనుచరులపై పరస్పరం కేసులు పెట్టుకుంటున్నారు. వీరి వివాదాల్లో చిన్నారులు సైతం పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. నందికొట్కూరు వైసీపీ నేతల మధ్య రచ్చ పై స్వయంగా సీఎం చెప్పినా వీరి పంథా అధిపత్యపోరు మాత్రం ఆగడం లేదు.

కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతగా నందికొట్కూరు నియెజకవర్గం లో వైసీపీ నేతలు ఆధిపత్యం కోసం రోడ్డెక్కుతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండానే సొంతపార్టీ ప్రతిష్టను బజారుకీడుస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ వర్గానికి, పార్టీ ఇంఛార్జ్ సిద్దార్థరెడ్డి వర్గాల మధ్య వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియెజకవర్గం లో ఎక్కడ ఒకచోట తరచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీని ఎలా పటిష్టం చేయాలి..ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాలకంటే సొంత పార్టీ నేతలను ఎలా దెబ్బ తీయాలి, ఎక్కడ దాడులు చేయాలి, ఏ సెక్షన్ల కేసులు పెట్టి లోపల వేయించాలి అనే ఎత్తులు వేయడంలో నిమగ్నమయ్యారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయులు పరస్పరం పెడుతున్న కేసుల చిట్టా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పగిడ్యాల మండలం పాతకోటలో దళితుల వాటర్ ట్యాంక్ లో సిధార్థరెడ్డి వర్గీయుల పిల్లలు మూత్రం పోసారని, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు దాడి చేసారని ఘర్షణవతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వర్గీయునిపై సిధార్థరెడ్డి వర్గీయులు హత్యాయత్నం కింద కేసుపెట్టారు. దీంతో అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపారు పోలీసులు. ఆ తరువాత ఎమ్మెల్యే వర్గీయులను కులం పేరుతో దూషించారంటూ సిధార్థ రెడ్డి వర్గీయులపై ఫిర్యాదు చేశారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద సిధార్థరెడ్డికి వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీంతో సిధార్థరెడ్డి వర్గీయులు 6 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది.అందులో 10, 12 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు చిన్నారులు వున్నారు.

ఎమ్మెల్యే ఆర్థర్ , సిధార్థరెడ్డి వర్గాల మధ్య ఇదొక్క గొడవే కాదు. జూపాడుబంగ్లా మండలం లో శిలాఫలకం విషయంలో సిద్దార్థ రెడ్డి వర్గీయుడు ఎమ్మెల్యే వర్గీయులపై ఎస్సై, ఎస్టీ కేసు పెట్టారు. పారుమంచాల లో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా వాట్సప్ గ్రూప్ ల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో రెండు వేరు వేరు కేసులు సిద్దార్థరెడ్డి వర్గీయులు ఇద్దరిపై కేసు పెట్టారు. తాటిపాడులో ఎమ్మెల్యే వర్గీయుడు అదే గ్రామానికి చెందిన సిద్దార్థ రెడ్డి వర్గీయుల పై కేసు పెట్టారు. తిరిగి సిద్దార్థ వర్గీయులు అతని పై కౌంటర్ కేసు పెట్టారు. ఒక్క జూపాడుబంగ్లా మండల లొనే పరస్పరం 5 కేసులు నమోదయ్యాయి. పాతకోటకు చెందిన ఎమ్మెల్యేవర్గీయునిపై సిద్దార్థరెడ్డి వర్గీయులు నందికొట్కూరు శివారులోని జీవన్ జ్యోతి స్కూల్ వద్ద హత్యయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడడంతో ఆ కేసు లో సిద్దార్థరెడ్డి తో పాటు మరో 15 మంది పై ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టారు.

నందికొట్కూరు సభలో సిధార్థ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యే ఆర్థర్ పైన మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేల పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన నియోజకవర్గంలో స్థానికసంస్థల్లో విజయం సాధించి ఇతర నియోజకర్గాల్లోనూ జోక్యం చేసుకుంటానంటూ హెచ్చరించారు సిధార్థ రెడ్డి. సీఎం జగన్ తనను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నారని, నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చారు. సభలో చేసిన ఈ ప్రసంగంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సీఎం జగన్ కూడా ఫిర్యాదు చేశారట. ఆ సందర్భంలో నందికొట్కూరు పంచాయతీ చూడమని మరో ఎమ్మెల్యేకి సూచించారట సీఎం జగన్.