రాజకీయాల్లో నాయకులు ఎంత ఎత్తుకు ఎదిగినా.. ప్రజల మధ్యకు వచ్చేసరికి సంప్రదాయాలకు విలువ ఇవ్వాల్సిందే. కనీస మర్యాదలను పాటించాల్సిందే. పైగా ఇప్పుడున్న మీడియా దూకుడు ముందు నాయకులు మరింతగా సంయమనం పాటించాలి. పార్టీలపైనా, పార్టీ అధినేతపైనా ఎంత ప్రేమైనా ఉండొచ్చు. కానీ, ప్రత్యర్థులు చేసే విమర్శలకు సమాధానం ఇచ్చే క్రమంలో నాయకులు అందునా.. అధికారంలో ఉన్న నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే.. మొదటికే ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. చంద్రబాబుపై అభిమానంతో.. అప్పట్లో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ.. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని.. అలాంటి వాడు ఆరోపణలు చేస్తే.. ఎలా స్పందిస్తానని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో అప్పటికేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు కూడా ఇలానే పవన్‌పై వ్యాఖ్యానించారు. అంతిమంగా.. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి సరిచేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీలోనూ నాయకులు ఇదే తరహా దూకుడు వ్యాఖ్యలు, రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామం.. పైకి పార్టీని, పార్టీ అధినేత, సీఎం జగన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నా.. అంతిమంగా.. అది ఇబ్బందికర వాతావరణం దిశగా అడుగులు వేసేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతోపాటు సోషల్ మీడియాలోనూ విమర్శలకు దారితీశాయి. అలా మాట్లాడ కూడదని ఆయనకు తెలియదా? అంటే.. తెలుసు. అయినా.. సహనాన్ని కోల్పోతున్న పరిస్థితి పార్టీని, నేతలను కూడా ఇరుకున పెడుతోంది. ఇక, స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం కూడా ఇటీవల కాలంలో అదుపుతప్పుతున్నారనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజకీయాలు మాట్లాడడం, అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం వంటివి సరికాదని అంటున్నారు.
మరో మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన నోరు విప్పితే.. ప్రత్యర్థులు చెవులు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఇటీవల సోషల్ మీడియాలో వ్యాఖ్యలు హల్‌చల్ చేశాయి. ఇలా వైసీపీ మంత్రులు కట్టుతప్పుతున్న పరిస్థితి ఇప్పుడే ఉంటే.. రాబోయే మూడేళ్లు మరింతగా ఇబ్బందులు ఖాయమని అంటున్నారు. ఒకవైపు ఇప్పటికే.. న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరోపక్క, మంత్రులు, నేతలు సంయమనం కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash