నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినా… ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చెప్పినా… ప్రజల్లో చాలా లోతుగా పాతుకుపోయిన విషయాల్లో ప్రజల ఆరోగ్యంపై వాళ్లు చూపించిన శ్రద్ధ అందుకు సాక్ష్యంగా నిలిచిన 104 – 108 వ్యవస్థ ఒకటి! వారిద్దరూ మైకులు పట్టుకుని… “ప్రజలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లో కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్సులు రావాలి.. వస్తాయి” అని చెప్పిన మాట ఒక చరిత్ర! అంతటి చరిత్ర ఉన్న పథకం అది! మరి అలాంటి పథకాలను ప్రవేశపెట్టే విషయంలో స్వయంగా వైకాపా నేతలే జాగ్రత్తలు పాటించకపోతే.. కనీస జాగ్రత్తలు పాటించకపోతే… వైఎస్ అభిమానులకు, వైకాపా కార్యకర్తలకు కడుపుమండదా?
జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా, తాజాగా ప్రకటించిన పథకాల్లో అంబులెన్స్ వ్యవస్థ ఒకటి! దాదాపు 1088 అంబులెన్స్ లను ఏపీ ప్రజల కోసం ఇటీవలే ప్రారంభించి అన్ని నియోజకవర్గాలు – మండలాలకు పంపారు ఏపీ ముఖ్యమంత్రి. దీంతో… ప్రజారోగ్యం విషయంలో శ్రద్ధ చూపించడంలో తండ్రితో కొడుకు పోటీపడ్డారని ప్రశంసలు కురిసాయి. అలాంటి సమయంలో తాజాగా 108 అంబులెన్స్ వ్యవస్థకు పురుడుపోసిన రాజశేఖర్ రెడ్డి బొమ్మ లేకుండా.. జగన్ ఫోటో లేకుండా వైకాపా ఎమ్మెల్యే విడతల రజనీ ఈ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది.
తాజాగా 108లను వైఎస్సార్, వైఎస్ జగన్ ల ఫొటోలు లేకుండా కేవలం ఆ ఎమ్మెల్యే ఫొటో మాత్రమే ఫ్లెక్సీలో పెట్టుకొని ప్రారంభించడంపై చిలకూరిపేట ప్రజలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కార్యక్రమాన్ని వైఎస్ఆర్ – జగన్ ఫొటోలు లేకుండా ఎలా మొదలుపెడుతారని.. ఇది ఆమె సొంత వ్యవహారం కాదనే విషయం గుర్తించాలని.. ఏమాత్రం అవకాశం ఉన్నా మంత్రి అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో… నిర్లక్ష్యంతో కూడిన ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదని పలువురు సూచిస్తున్నారు!!