గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు రాయలసీమలోనూ, అందులోనూ జగన్ పురిటిగడ్డ పులివెందులలో కత్తి యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసిన రాజుగారు పదే పదే అనేక విషయాలపై సొంత పార్టీపై విమర్శలు చేస్తూ, జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాడు. తనకు ఏపీలో ప్రాణహాని ఉందని చెబుతూ, కేంద్రానికి అర్జీ పెట్టుకొని మరి కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఏపీలో అడుగు పెట్టకుండానే, ఢిల్లీ నుంచే పదునైన విమర్శల బాణాలను సొంత పార్టీపై వేస్తూ, తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలకు మద్దతు తెలుపుతూ, కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
కానీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయకుండా మౌనంగానే ఉండిపోతున్నారు. బీజేపీని ఏదో ఒక రకంగా ఒప్పించి, ఆయనపై అనర్హత వేటు వేయించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ రాజు గారికి తెలిసినా, పట్టించుకోనట్టు గానే పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ వైసిపి నాయకులను ఉద్దేశించి రాజుగారు ఓ సవాల్ విసిరారు. 10 వేల మందితో తాను పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని సవాల్ చేసి సంచలనం సృష్టించారు. సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లేందుకు ధైర్యం చేయని రాజు గారు ఇప్పుడు మాత్రం జగన్ సొంత ఇలాకాలో బహిరంగ సభ పెడతానంటూ హడావుడి చేస్తుండటం, కేవలం సంచలనం కోసమే అంటూ వైసీపీ నాయకులు తేలిగ్గా తీసుకుంటున్నారు.
తన తోలు తీస్తాను అంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ స్థాయిలో స్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితి లో తాను లేనని చెప్పారు. తనకు పులివెందుల లో కూడా స్నేహితులు ఉన్నారని, పదివేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకుందని చెప్పారు. అయితే కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ రాజుగారు అన్నట్టుగానే పులివెందులలో యుద్ధ గంట మోగిస్తే ఆయనతో యుద్ధం చేసేందుకు జగన్ ఏ విధమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటారో ?
-Surya