ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు కేంద్రం నుంచి అనుమతులు లభించడం లేదు. శాసన మండలి రద్దు, మహిళలకు రక్షణ కల్పించే దిశ చట్టానికి గ్రీన్ సిగ్నల్, జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు వంటి విషయాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సమయోచిత సహకారం ఎండమావిగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ నేతలు సహకరించకున్నా కూడా ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు మాత్రం అక్కడివారికి తలలో నాలుకమాదిరిగా వ్యవహరిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ నాయకులు కోరిన వెంటనే రాజ్యసభ సీటును నత్వానీకి కేటాయించారు. అత్యంత కీలకమైన వ్యవసాయ బిల్లుకు దేశంలోని చాలా పార్టీలు వ్యతిరేకించినా.. ఆఖరుకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీలు కూడా వ్యతిరేకించి బయటకు వచ్చినా.. వైసీపీ నాయకులు మాత్రం వ్యూహాత్మకంగా కేంద్రానికి రాజ్యసభలో సహకరించి.. బిల్లు పాసయ్యేందుకు దోహద పడ్డారు.
అదే సమయంలో కేంద్రం జీఎస్టీ నిధులు ఇవ్వకపోయినా.. సర్దుకు పోతున్నారు. ఇక, పార్టీలో ఎవరైనా కేంద్రంలోని పెద్దలపై విమర్శలు చేస్తే.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని బీజేపీ నేతలు రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నా.. మౌనం పాటిస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని వైసీపీకి సహకరించడం లేదు. నిధులు కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీతో మనం అతిగా ఉంటున్నామా? వారు మనకు సహకారం అందించకపోయినా.. మనంరాసుకుని, పూసుకుని తిరుగుతున్నామా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంతలా మనం వ్యవహరించడం, కేంద్రంలోని బీజేపీ తాన అంటే.. తందాన అనడం అవసరమా? అని నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలోనూ కేంద్రం నుంచి సహకారం లభించనప్పుడు మనం ఎంతవరకు ఉంటే అంత మంచిది కదా? అనే ప్రశ్నను కూడా సంధిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో చర్చకు వస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో ? చూడాలి.
-Vuyyuru Subhash