ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు వీడియో ప్రజంటేషన్ చేసింది. జూన్ ఒకటి 2014 నుంచి డిసెంబర్ 31 వరకు భారీగా భూములు కొనుగోలు చేసారని వైసీపీ ఆరోపించింది. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు, గుంటూరు జిల్లాలో, 2279 ఎకరాలు కొనుగోలు చేసారని ఆరోపించారు. దీనిపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు బినామి పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసారని, ఆ భూములు పోతాయనే భయం పట్టుకుందని ఆరోపించారు.
రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసారని మండిపడ్డారు. భువనేశ్వరికి అమరావతిపై అంత కరుణ ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. గత అయిదేళ్ళలో అమరావతిలో రైతులు ఆందోళన చేసారని అప్పుడు ఎందుకు స్పందించలేదని, తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు జాలి కలగలేదా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే జాలి కలగలేదా అన్నారు. ఆమెకు రైతులపై ప్రేమా లేక భూములపై ప్రేమా అని ప్రశ్నించారు. తండ్రి కొడుకు భూములు పోతాయని ఆందోళన చేస్తున్నారన్నారు.
కారుణ్య మరణాలు అనే కొత్త డ్రామా చంద్రబాబు ఆడుతున్నారన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… అమరావతిలో భారీగా అక్రమాలు జరిగాయని అన్నారు. రాజధాని పేరుతో అక్రమాలు చేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ భూముల్లో భారీగా అవినీతి జరిగింది అన్నారు. అమరావతి ప్రకటనకు ముందే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. 800 మంది తెల్ల రేషన్ కార్డు దారుల నుంచి భూములు లాక్కున్నారని, లింగామనేనికి లబ్ది చేకూర్చి ఆయన గెస్ట్ లాక్కున్నారు అంటూ ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదు అన్నారు.