దేశంలో రోజుకో వైరస్ పుట్టుకొస్తుంది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇప్పుడు వైరస్‌ల హవా నడుస్తోంది. ఏదో ఒక మూల ఏదో ఒక కొత్త వైరస్ పురుడుపోసుకుంటుంది. వీటి టార్గెట్ ముఖ్యంగా చిన్నపిల్లలే.. అమెరికా, బ్రిటన్లను ‘స్ట్రెప్ ఎ’ వైరస్ వణికిస్తుంటే.. మన దేశంలో కొత్తగా జికా వైరస్ కేసులు పెరగడం మొదలయ్యాయి. పుణెకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పాజిటివ్ అని తేలిన కొద్ది రోజులకే.. కర్ణాటకలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ఐదేళ్ల చిన్నారికి సైతం ఈ వ్యాధి సోకింది.
ఐదేళ్ల చిన్నారి రక్తనమూనాలను వైద్యులు పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. చిన్నారికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జికాను ఎదుర్కొనేందుకు మేము సన్నద్ధమయ్యే ఉన్నామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ మీడియాకు తెలిపారు.
పుణెలో.. 67ఏళ్ల వృద్ధుడికి..
డిసెంబర్ తొలి వారంలో.. పుణె బావ్ధాన్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ 67ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు.. నాసిక్‌లో నివాసముండే ఆ వ్యక్తికి.. నవంబర్ 6న పుణెకు వెళ్లాడు. జ్వరం, జలుబు, దగ్గు, శరీరం నొప్పుల కారణంగా నవంబర్ 16న జహగీర్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. జికా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచే..
1947లో ఉగాండలోని అడవుల్లో తొలిసారిగా ఈ జికా వైరస్‌ను గుర్తించారు. అప్పటి నుంచి ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్ ద్వీపాల్లో జికా వైరస్ కలకలం సృష్టించింది. 2016లో బ్రెజిల్లో జికా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. కొన్ని నెలల క్రితం.. కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో సైతం జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
కారణాలు, లక్షణాలు..
ఏడెస్ జాతి దోమల కారణంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇవి మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. దద్దుర్లు, జ్వరం, కంజెక్టివైటిస్, జాయింట్ నొప్పులు, తలనొప్పులు వంటి సమస్యలు.. జికా వైరస్ లక్షణాలుగా ఉన్నాయి. ఇవి 2-7 రోజుల వరకు ఉంటాయి.
జికా వైరస్ కోసం ప్రత్యేకంగా చికిత్సేమీ అవసరం లేదు. జికా వైరస్ సోకిన రోగులకు ఎక్కువగా విశ్రాంతి కావాలి. ద్రవ పదార్థాలే ఎక్కువగా తీసుకోవాలి. పారాసిటమాల్‌తో జ్వరాన్ని నియంత్రించుకోవచ్చు. అప్పటికీ లక్షణాలు ఎక్కువగా ఉంటే.. అప్పుడు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. జికాకు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో దోమకాటుకు గురవ్వదు..పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చలిగా ఉంది కదా ఫ్యాన్ లేకుండా నిద్రపోయి.. దోమలకు మీ రక్తాన్ని డిన్నర్‌గా అసలే ఇవ్వొద్దు.!