అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్‌లోని గులాబీ రాయితో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ మొదటి అంతస్తు నిర్మాణం అంటే గర్భగుడి నిర్మాణం మరో రెండేళ్లల్లో పూర్తవుతుందని ఆలయ కమిటీ వెల్లడించింది. అప్పటివరకు రాంలీలా విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచనున్నారు.
అయితే ఆలయ నిర్మాణ డిజైన్‌ను ముస్లిం కళాకారులు చెక్కనున్నారు. ఆలయం మొదటి అంతస్తులో 14 తలుపులు ఉంటాయి. ఈ తలుపులను ముస్లిం కళాకారులతో చెక్కించనున్నారు. తెల్లటి రంగు మక్రానా పాలరాయి ఫ్రేమ్‌లు, సైడ్‌లు అమర్చనున్నట్లు సమాచారం. ఈ తలుపుల ఫ్రేమ్‌లు, సైడ్‌లను శ్రీరామ జన్మభూమి వర్క్ షాప్‌కు తీసుకొచ్చి భద్రంగా ఉంచారు. ఇప్పుడు ఆలయ నిర్మాణంతో పాటు రాంలీలా గర్భగుడి, 13 ఇతర ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. గోండా జిల్లాలోని బహ్రైచ్, షీషమ్-సఖు, మాన్కాపూర్ అడవుల నుంచి టేకు కలపను తీసుకొచ్చారు. అయితే రాంలీలా ఆలయానికి తలుపులు, ఫ్రేమ్‌ను ఏ కలపతో ఏర్పాటు చేయనున్నారో సందిగ్ధంలో ఉన్నారు.