బ్యూటీ స్పీక్స్ : ఆకాశ వీధిలో అద్భుతాల సృష్టి .. రా రండోయ్ వేడుక చూద్దాం

లోకానికి ఎంతో అబ్బుర ప‌రిచే గ్ర‌హ మండ‌లంలో ఎన్ని తారలు స‌భ్య‌త్వం తీసుకుని ఉన్నాయి. తార‌ల‌తో పాటూ ఇంకొన్ని కూడా ఉన్నాయి. కాంతి విక్షేప‌ణం, కాంతి ప్ర‌యాణం, గ్ర‌హాల న‌డ‌వడి, కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన విస్ఫోట‌నాల ఆన‌వాళ్లు ఇంకా ఏవేవో ఆవిష్కృతం అవుతూనే ఉన్నాయి. కాలం వీటిని మ‌రో సారి ఆవిష్కృతం చేస్తుంది కూడా ! నెత్తి మీద ఉన్న తారా మండ‌లం కొంద‌రికి అదృష్టం అయి ఉంటుంది. కొంద‌రికి దుర‌దృష్టం కూడా అయి ఉంటుంది. అవి న‌మ్మ‌కాల ప్ర‌కారం.. కానీ శాస్త్ర సాంకేతిక ప‌రిజ్ఞాన ప్ర‌కారం ఈ విశ్వం ఓ ప‌ర‌మాద్భుతం. అందులో ఇంకా తెలియ‌నివి వెల్ల‌డిలో లేనివి ఎన్నో ఉన్నాయి. ప్రామాణిక న‌మ్మ‌కాలు మాత్ర‌మే మంచివి. వాటిని సైన్స్ అందిస్తుంది.

కొన్ని ఊహా సంబంధ నమ్మ‌కాలు మ‌నిషికి ఊర‌ట‌నిస్తాయి కానీ ఎల్ల‌కాలం అవే నిజం అవుతాయి అనుకోవ‌డం అత్యాశే అవుతుంది. క‌నుక గ్ర‌హ గ‌తులు, ఇంకా గ్ర‌హ శ‌క‌లాలు ఇంకా ఏవో నిరంత‌రం మ‌న‌కు కొన్ని విష‌యాలు నేర్పుతూనే ఉంటాయి. సంబంధిత అందాల ఆవిష్క‌ర‌ణ‌కు వైజ్ఞానిక భావ‌న‌లు తోడ‌యి ఉంటే అవి ఎందుకు ఎలా వ‌చ్చాయో అన్న‌వి వెలుగులోకి వ‌స్తాయి. క‌నుక వైజ్ఞానిక భావ‌నే ఈ సృష్టి వికాసానికి మ‌రింత తోడ్పాటు ఇచ్చే గొప్ప విష‌యం. వైజ్ఞానిక భావ‌న‌ల ఆధారంగా మ‌నో వికాసం సిద్ధిస్తుంది. ఆ విధంగా ఎన్నో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆ భావ‌న‌లు ఉప‌యోగ ప‌డ‌తాయి. కనుక ఈ వేస‌విలో ఆకాశం ప‌ర‌దా కింద మ‌నం.. తార‌లు మాట్లాడ‌తాయి వినండి.. గ్ర‌హాలు అబ్బుర‌ప‌రుస్తాయి.. అవి కూడా వినండి.  చంద‌మామ క‌థ క‌ల్పితం.. సైన్స్ ఆధారిత జీవిత‌మే నిజం.

ఆకాశానికీ భూమికీ మ‌ధ్య ఎన్ని ఆక‌ర్ష‌ణ విక‌ర్ష‌ణ‌ల విల‌యాలు ఎన్ని దూరాలు ఎన్ని కాంతుల దూరాలు ఎన్ని చీక‌టి వ‌ల‌యాలు ఎన్ని న‌క్ష‌త్ర మండ‌లాలు మ‌రియు ఎన్ని గ్ర‌హ శ‌కలాలు. అన్నింటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అందం గురించి ఎక్కువ శ్ర‌ద్ధ వ‌హించి మాట్లాడుకుంటున్నాం అంటే అందుకు కార‌ణం మ‌న ఆస‌క్తి. సృష్టిలో ఉన్న అందం..ప్లానెట్ ప‌రేడ్ (ఒకే స‌ర‌ళ రేఖ‌పైకి నాలుగు గ్ర‌హాలు రావ‌డంను ప్లానెట్ ప‌రేడ్ అని పిలుస్తారు) కు కూడా వ‌చ్చింది.

ఆ అందం కార‌ణంగా వెయ్యేళ్ల కాలం మ‌ళ్లీ వెన‌క్కు వ‌చ్చింది. కాలం క‌రిగితే అందం పోతుంది మనిషికి.. కాలం క‌రిగితే అందం అద‌నంగా వ‌చ్చి చేరుతుంది ప్రకృతికి ఆ విధంగా ఇవాళ ప్లానెట్ ప‌రేడ్ కార‌ణంగా ఎన్నో అందాలు అద్భుతాలు క‌ళ్లెదుట ఆవిష్కృతం అయిన తీరును బెంగ‌ళూరు సైన్స్ సెంట‌ర్ వివ‌రిస్తోంది. ఏప్రిల్ 26, 27 తేదీలలో ఒకే స‌ర‌ళ రేఖ పైకి  శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు వ‌చ్చి అబ్బుర‌ప‌రిచాయి.వెయ్యేళ్ల కింద‌ట ఇటువంటి ఆవిష్క‌ర‌ణ ఒక‌టి జ‌రిగింద‌ని వారు అంటున్నారు. అబ్బుర ప‌రిచే రీతిలో ఇటువంటి విన్యాసాలు గ్ర‌హ మండలంలో అప్పుడప్పుడూ జ‌రిగి, మాన‌వ‌స‌క్తిని మ‌రింత పెంచుతున్నాయ‌ని వారంతా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న ఏప్రిల్ 30న కూడా మ‌రో అద్భుతం ఆవిష్కృతం కానుంద‌ని, అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలు శుక్రుడు, బృహస్పతి ఒకదానికొకటి చాలా దగ్గరగా చూడవచ్చునని కూడా నిపుణులు చెబుతున్నారు.