బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ ఇటీవలే కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ లో మరో నలుగురితో అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన విషయం విదితమే. దీంతో ఆయన లాంచ్ చేయనున్న వర్జిన్ గెలాక్టిక్ వాణిజ్య అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది.. అంటే 2022 జూలై 11న కమర్షియల్ ఫ్లైట్‌ను అంతరిక్షానికి పంపనున్నారు. అందులో ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తారు.
అయితే అదే ఫ్లైట్‌లో ఇద్దరు అదృష్టవంతులు ఉచితంగానే అంతరిక్ష యాత్ర చేయవచ్చు. అవును.. ఇది నిజమే. అంతరిక్ష యాత్ర సందర్భంగా ఆ ఇద్దరికీ విండో సీట్లు ఇస్తారు. దీంతో ఫ్లైట్ నుంచి భూమిని వీక్షించవచ్చు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లగానే ఒక అద్దం ఇస్తారు. దాంతో భార స్థితిని చూసుకోవచ్చు. హెచ్‌డీ వీడియోలను రికార్డు చేస్తారు. ఇక సదరు యాత్రలో ఉచితంగానే పాల్గొనాలంటే అందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
omaze.com/space అనే వెబ్‌సైట్‌లో ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వారు డబ్బును డొనేట్ చేసి లేదా చేయకుండానే యాత్రకు రెండు విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా యాత్రికులు తమ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఒక మెయిల్ ఐడీ సహాయంతో ఒకరు మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి 6వేల ఈ-మెయిల్స్‌తో ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఉచితంగా లేదా డబ్బులు డొనేట్ చేసి ఎలా రిజిస్టర్ చేసుకున్నా ఆ వివరాలను అన్నింటినీ కలిపి ఒక రోజు డ్రా తీస్తారు. ఇద్దరు ప్రయాణికులను ఎంపిక చేస్తారు. వారు వచ్చే ఏడాది సదరు ఫ్లైట్‌లో ఉచితంగా అంతరిక్ష యాత్ర చేయవచ్చు.
ఇక ఇందుకు గాను యాత్రికుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. వారికి ఒమేజ్‌తో ఎలాంటి సంబంధాలు ఉండరాదు. వారు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి. అంతే.. ఈ అర్హతలు ఉంటే చాలు.. ఎవరైనా ఉచిత అంతరిక్ష యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇంకు సెప్టెంబర్ 2, 2021వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అందువల్ల మీకు అంతరిక్ష యాత్ర చేయాలని ఉంటే.. మీ లక్‌ను ఒకసారి పరీక్షించుకోండి మరి..!