ఈమె మామూలు మ‌హిళ కాదు.. 20వేల మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చింది..!

గ‌త 20 ఏళ్ల నుంచి భ‌ర్త స‌హ‌కారంతో సైనికుల‌కు సీమా రావు శిక్ష‌ణ‌నిస్తోంది. అలా సీమా రావు ఇప్ప‌టికి 20 ఏళ్లుగా 20వేల మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చింది.

నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు కూడా పురుషుల‌కు దీటుగా అనేక రంగాల్లో త‌మ స‌త్తా చాటుతున్నారు. విమానాల‌ను న‌డుపుతున్నారు. ఆకాశంలో విహ‌రిస్తున్నారు. అంత‌రిక్ష యాత్ర‌లు చేస్తున్నారు. ఇదీ.. అదీ.. అనే రంగం కాదు.. అన్ని రంగాల్లోనూ పురుషుల క‌న్నా ఎక్కువ‌గానే మ‌హిళ‌లు రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌న దేశానికి చెందిన ఆ మ‌హిళ కూడా ఎవ‌రూ ఎంచుకోని రంగంలో చేరి త‌న స‌త్తా చాటుతోంది.

ఆమే.. ముంబైకి చెందిన డాక్ట‌ర్ సీమా రావు. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చి పేరు తెచ్చుకుంది.

ముంబైకి చెందిన డాక్ట‌ర్ సీమా రావు (49) తండ్రి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. దీంతో ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే దేశానికి సేవ చేయాల‌నే భావ‌న బ‌లంగా ఉండేది. ఈ క్ర‌మంలోనే ఆమె ఓ వైపు డాక్ట‌ర్ విద్య‌ను, ఎంబీఏను పూర్తి చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ ఆమె ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాల‌నుకుంది. దీంతో పెళ్ల‌య్యాక త‌న భ‌ర్త డాక్ట‌ర్ దీప‌క్ రావు శిక్ష‌ణ‌లో మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంది. ఆ త‌రువాత ఇక వెన‌క్కి తిరిగి చూడలేదు. ఆర్మీలో చేరి ఎన్నో ర్యాంకులు పొందింది. ఆ త‌రువాత గ‌త 20 ఏళ్ల నుంచి భ‌ర్త స‌హ‌కారంతో సైనికుల‌కు శిక్ష‌ణ‌నిస్తోంది. అలా సీమా రావు ఇప్ప‌టికి 20 ఏళ్లుగా 20వేల మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చింది. అయితే ఆమె కేవలం సైనికుల‌కే కాదు, పోలీసులు, పారా మిల‌ట‌రీ సిబ్బందికి కూడా శిక్ష‌ణ ఇచ్చి పేరు తెచ్చుకుంది.

ఇక సీమారావుకు కేవ‌లం ఆర్మీలోనే కాదు.. షూటింగ్‌, అగ్నిమాప‌క దళం, స్కూబా డైవింగ్ వంటి అంశాల్లోనూ ప్ర‌వేశం ఉంది. ఆమె మిల‌ట‌రీ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో 7వ గ్రేడ్ బ్లాక్ బెల్ట్ హోల్డ‌ర్. ఈ క్ర‌మంలోనే ఆమె భార‌త్‌కు చెందిన తొలి మ‌హిళా క‌మాండో ట్రెయిన‌ర్ గా పేరు తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు సీమారావును అంద‌రూ ఇండియాస్ వండ‌ర్ వుమ‌న్ అని పిలుస్తున్నారు. ఇక ఆమె దేశానికి చేసిన సేవ‌ల‌కు గాను ఎన్నో అవార్డులు ఆమెను వ‌రించాయి.

2019 సంవ‌త్స‌రానికి గాను ఫోర్బ్స్ ఇండియా డ‌బ్ల్యూ-ప‌వ‌ర్ ట్రైబ్లేజ‌ర్స్ లో డాక్ట‌ర్ సీమారావు చోటు సాధించింది. అలాగే ఆమెకు 3 ఆర్మీ అవార్డులు, అమెరికా ప్రెసిడెంట్ వాలంటీర్ స‌ర్వీస్ అవార్డు, వ‌ర‌ల్డ్ పీస్ డిప్లొమాట్ అవార్డులు కూడా ల‌భించాయి. ఇక 2019 సంవ‌త్స‌రానికి గాను దేశంలోని మ‌హిళ‌ల‌కు ఇచ్చే అత్యున్న‌త స్థాయి పుర‌స్కారం అయిన నారీ శ‌క్తి పుర‌స్కార్‌ను కూడా సీమారావు అందుకుంది. ఇక బ్రూస్ లీ క్రియేట్ చేసిన జీత్ కునె దొ అనే ప్ర‌త్యేక మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా శిక్ష‌ణ ఇస్తున్న 10 మంది మ‌హిళా శిక్ష‌కుల్లో ఈమె ఒక‌రిగా ఉంది. అదేవిధంగా ఈమెకు గ‌తంలో మిసెస్ ఇండియా వర‌ల్డ్ అవార్డు కూడా ల‌భించింది. అలాగే యుద్ధ నైపుణ్యాలు, బాంబుల త‌యారీపై ఆమె ప‌లు పుస్త‌కాల‌ను కూడా రాసింది. వాటిని ఇండియన్ ఆర్మీ, అమెరికా ఎఫ్‌బీఐ రిఫ‌రెన్స్ కింద ఉప‌యోగించుకుంటున్నాయి. ఏది ఏమైనా.. డాక్ట‌ర్ సీమా రావు గాథ ఇత‌ర మ‌హిళంద‌రికీ ఆద‌ర్శ‌మే క‌దా..!