నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3

-

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పర్యావరణం, ప్రకృత్తి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుందని వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాలపాటు సాగనుందని పేర్కొన్నారు.

ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ (ఈవోఐఆర్‌) పేలోడ్‌ మిడ్‌-వేవ్, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్‌ చేస్తుందని.. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అంతకుముందు ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకునిఉపగ్రహం నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టు పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news