చాట్ జీపీటీయా మజాకా.. ఒక్క ప్రశ్నతో నిమిషంలో రూ.17వేలు

-

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక ఏఐ ఆధారంగా డెవలప్ చేసిన చాట్ జీపీటీ చేస్తున్న మాయ అంతా ఇంతా కాదు. దీనివల్ల మానవ మనుగడకు ముప్పు ఉందని తెలిసినా ఇది చేస్తున్న మాయ చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది. తాజాగా చాట్ జీపీటీ చెప్పిన ఓ సమాధానం ఓ వ్యక్తికి నిమిషంలో రూ.17వేలు సంపాదించి పెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అమెరికాకు చెందిన జోషువా బ్రౌడర్‌ అనే వ్యక్తి తనకు డబ్బులు కావాలి అని ఇటీవల చాట్‌జీపీటీని అడగ్గా.. అతడు క్లెయిమ్‌ చేసుకోని 210 డాలర్లు (దాదాపు రూ.17,000) రికవరీ చేసిపెట్టింది. ‘‘నా పేరు జోషువా బ్రౌడర్‌. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నా పుట్టిన తేది 12/17/1996. నాకు కొంత డబ్బులు కావాలి?’’ అని ఆయన చాట్‌జీపీటీని అడిగారు. అనంతరం రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ.. అతడు ఇప్పటివరకు క్లెయిమ్‌ చేసుకోని ఆఫర్‌ను ఆన్‌లైన్‌లో వెతికిపెట్టింది. ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా చెప్పింది.

బ్రౌడర్‌ కూడా చాట్‌జీపీటీ చెప్పినట్లు చేశారు. అనంతరం నిమిషం వ్యవధిలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి 210 డాలర్లు తన బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, చాట్‌బాట్‌కు క్యాప్చా రీడ్‌ చేయడంలో ఇబ్బంది తలెత్తిందని, అది మినహాయిస్తే మిగతాదంతా.. అదే చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news