సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త అప్‌డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్ ట్యాబ్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్‌బుక్‌లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్‌బుక్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.