ప్రపంచ సైకిల్ దినోత్సవం: భవిష్యత్తు మొత్తం “ఈ” సైకిల్ చక్రం కిందే..

సైకిల్ దినోత్సవం అనేది కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 3వ తేదీనీ ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే, సైక్లింగ్ వలన కలిగే ఉపయోగాలని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యమే. కేవలం ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా ఇది మంచిది. ఇంధన వాడకాల వల్ల అవుతున్న కాలుష్యం నుండి కొద్దిగానైనా బయటపడవచ్చు. అందుకే ఈ రోజున సైక్లింగ్ ప్రాధాన్యతలని అందరికీ తెలియజేస్తారు.

చిన్నప్పుడు చేతికి సైకిల్ చిక్కిందంటే చాలు అలా అలా వీధులన్నీ తిరిగేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. సైకిల్ వాడకం బాగా తగ్గింది. కానీ భవిష్యత్తు మొత్తం సైకిల్ చక్రం కిందే తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు సాంప్రదాయ వాహనాల్లో తిరగాలంటే భయం పుట్టిస్తున్నాయి. రోజు రోజుకీ ఆకాశం అంటుతున్న ధరలు చూస్తుంటే సైకిల్ వైపు తిరిగొచ్చే వారు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్న “ఈ- సైకిల్స్” ఆ దిశగా మళ్ళేలా చేస్తున్నాయి.

ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే సైకిల్స్ మూలంగా వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా అందుతుంది. తక్కువ దూరాలతో పాటు సరదాగా ఎక్కువ దూరాల వరకు వీటి మీద ప్రయాణం చేయవచ్చు. కిలోమీటరుకు 7పైసలు ఖర్చు గల ఈ- సైకిల్స్ వాడకం మంచిదని చాలా మంది ఆలోచన. మహమ్మారి సమయంలో ప్రజా రవాణా కంటే ఇలాంటి ఈ- సైకిల్స్ మేలని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ- సైకిళ్ళ వాడకం విరివిగా పెరగనుంది. అందుకే మీక్కావాల్సిన సైకిల్ ఎంచుకుని ఎంచక్కా ట్రిప్ వేసేయండి.