షియోమీ ఘ‌న‌త‌.. యాపిల్‌ను అధిగ‌మించింది.. ప్రపంచంలో 2వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతర‌ణ‌..!

మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్‌ను అధిగ‌మించింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ ఆ మార్కెట్‌లో 83 శాతం ఇయ‌ర్ ఆన్ ఇయ‌ర్‌ను సాధించింది. ఇది టాప్ 5లోని సంస్థల క‌న్నా అత్యధికంగా ఉందని కెనాలిస్ నివేదిక తెలియజేసింది.

షియోమీ గణనీయమైన వృద్ధిని కనబరిచినప్పటికీ ప్రపంచంలోని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా తన సింహాసనాన్ని శామ్‌సంగ్ నిలుపుకుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా వంటి ఫోన్‌లను తయారుచేసిన‌ దక్షిణ కొరియా టెక్ కంపెనీ అయిన శాంసంగ్.. గెలాక్సీ ఎమ్-సిరీస్, ఎ-సిరీస్ కింద జనాదరణ పొందిన బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను త‌యారు చేసి అందించింది. 2021 ద్వితీయ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 19 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ త్రైమాసికంలో శామ్‌సంగ్ 15 శాతం వృద్ధిని సాధించింది.

షియోమీ ప్రపంచవ్యాప్తంగా 17 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. లాటిన్ అమెరికాకు 300 శాతానికి పైగా, ఆఫ్రికాకు 150 శాతం, పశ్చిమ ఐరోపాకు 50 శాతానికి పైగా ఉత్ప‌త్తుల‌ను ఎగుమతి చేస్తున్న ఘనత షియోమీకి దక్కుతుంది. రవాణా చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ భాగం శామ్‌సంగ్, ఆపిల్‌ల‌తో పోలిస్తే షియోమీవి 40-75 శాతం త‌క్కువ ధ‌ర‌ల‌ను క‌లిగి ఉండ‌డం విశేషం. రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్, ఎంఐ 10ఐ, ఇటీవల లాంచ్ చేసిన ఎంఐ 11 లైట్ వంటి ఫోన్లు ఇప్పటికే భారతదేశంలో, కొన్ని ఇతర దేశాల మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్ర‌మంలో షియోమీ తన ప్రీమియం ఉత్పత్తులైన ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ఎక్స్ మొదలైనవాటిని కూడా భారీగా విక్ర‌యిస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం షియోమీ శామ్‌సంగ్‌ను అధిగమించి ప్రపంచ నంబర్ వ‌న్‌గా నిలిస్తే ఆశ్చర్య పోన‌క్క‌ర్లేద‌ని నిపుణులు అంటున్నారు. మ‌రి షియోమీ నంబ‌ర్ స్థానానికి చేరుకుంటుందా, లేదా అనేది చూడాలి.