ఓటా.. ఎవరేస్తారు.. గంటలు గంటలు అక్కడ వెయిట్ చేయాలి.. నావల్ల కాదు బాబోయ్.. అంటూ ఓటేయడం మానేస్తున్నారా? మీలాంటి వాళ్ల కోసమే ఎన్నికల కమిషన్ అద్భుతమైన యాప్‌ను తీసుకొచ్చింది.. దీని వల్ల మీరు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఓటేసి రావచ్చు..
ఎన్నికల్లో ఓటు వేయాలంటే చాలామంది ఓటర్లు భయపడేది అక్కడ ఉండే క్యూను చూసి. అవును.. చాంతాడంత క్యూను చూసి ఎవరు నిలబడతారు.. అని చాలామంది ఓటు వేయకుండానే వెనక్కి వచ్చేస్తారు. భారీ క్యూలైన్లు ఓటింగ్ శాతంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈసీ కృషి చేసింది. దీంతో ‘మైఓట్‌క్యూ’ అనే ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది.
ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద ఎంత క్యూ ఉంది.. ఎంతమంది ఓటు కోసం వేచి ఉన్నారు. ఇలాంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీంతో భారీ క్యూలో నిలుచొని సమయం వృథా చేసుకోకుండా పోలింగ్ కేంద్రం వద్ద జనాలు లేని సమయం చూసి ఓటేసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ గురించి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు వివరించారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తే ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముందుగా దీన్ని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆ ఎన్నికల్లో విజయవంతం అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.