ఆస్ట్రేలియా ప్రస్తుతం చరిత్రలో చూడని నష్ట౦ ఎదుర్కొంటుంది. కార్చిచ్చు ఆ దేశాన్ని దహించి వేస్తుంది. దేశంలో అగ్ర భాగం మంటల్లో ఉండటంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. భగవంతుడా అంటూ ఆకాశం వైపు చూద్దాం అనుకున్నా పొగ దెబ్బకు ఆకాశం కూడా కనపడటం లేదు. భారీ మంటలతో లక్షల ఎకరాల్లో అడవులు, వేల హెక్టార్లలో పంటలు మాడి మసి అయిపోతున్నాయి.
ఈ మంటల్లో ఇప్పటి వరకు 24 మంది చనిపోగా భూమి మరియు వన్యప్రాణులకు చాలా నష్టం జరిగింది. ఆదివారం ఉదయం వర్షం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కొంత ఉపశమనం కలిగించింది, కాని పొడి మరియు వెచ్చని వాతావరణం మంటలను వ్యాపింపజేస్తూ వస్తుంది. ఈ మంటలు ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు, మంటల నుండి పొగ సముద్రం మీదుగా దాదాపు 2000 కిలోమీటర్ల మేర ఎగిరింది.
దీనితో న్యూజిలాండ్ కి ఈ పొగ వెళ్ళింది. ఇప్పుడు ఆక్లాండ్ నగరంతో సహా న్యూజిలాండ్‌లోని కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టింది. న్యూజిలాండ్ యొక్క ఆకాశం చీకటిగా, మరియు నారింజ రంగులోకి మారిపోయింది మరియు గాలి నాణ్యత విస్తృతంగా క్షీణించింది. వాతావరణ నివేదికల ప్రకారం, ఎగువ ఉత్తర ద్వీపంలో పొగ విస్తృతంగా ఉంది. ఈ పొగ మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.