ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉజ్వల 2.0 ( ప్రధాన మంత్రి ఉజ్వల యోజన– PMUY) ( Pradhan Mantri Ujjwala Yojana – PMUY ) పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహోబా నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందజేశారు.
![Pradhan Mantri Ujjwala Yojana | ప్రధాన మంత్రి ఉజ్వల యోజన Pradhan Mantri Ujjwala Yojana | ప్రధాన మంత్రి ఉజ్వల యోజన](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/08/ujjwala-2.0.jpg)
ఉజ్వల పథకం లబ్ధిదారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అయితే ఈ పథకం కింద మొదటి దశలో 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లను రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇచ్చారు. ఈ క్రమంలోనే రెండవ దశలో మరింత మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) 2016 లో ప్రారంభించబడింది. మొదటి దశలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్లను అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తరువాత ఏప్రిల్ 2018 లో మరో ఏడు వర్గాలకు చెందిన మహిళా లబ్ధిదారులను చేర్చారు. ఈ క్రమంలోనే రెండవ దశలో 8 కోట్ల మంది లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఉజ్వల 1.0కు కొనసాగింపుగా ఉజ్వల 2.0ను ప్రారంభిచారు. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో పేదలకు ఉచిత రీఫిల్ సిలిండర్లతోపాటు స్టవ్ లను, ఉచితంగా 1 కోటి గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని 2021-22లో 1 కోటి మంది కొత్త లబ్ధిదారులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే 8 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు.
ఈ పథకం వల్ల డిపాజిట్ రహిత LPG కనెక్షన్ న అందిస్తారు. అంటే ఉచిత కనెక్షన్‌తోపాటు రూ.800 కన్నా ఎక్కువ విలువ గల సిలిండర్‌ను, స్టవ్‌ను ఉచితంగా అందిస్తారు. గతంలో ఉజ్వల 1.0 కింద డిపాజిట్ ఫ్రీ LPG కనెక్షన్ ను మాత్రమే రూ.1,600 ఆర్థిక సహాయంతో అందించారు. ఇక లబ్ధిదారులు హాట్ ప్లేట్ (స్టవ్), మొదటి రీఫిల్ కోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి సున్నా వడ్డీకే రుణాన్ని కూడా పొందారు. దాంతో గ్యాస్ కనెక్షన్లను తీసుకున్నారు.
PMUY ఉజ్వల 2.0 లో నమోదు చేయించుకోవడం చాలా సులభమే. ఇందుకు వలసదారులు రేషన్ కార్డులు లేదా చిరునామా రుజువులను సమర్పించాల్సిన అవసరం లేదు. వారికి కావలసిందల్లా కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ధ్రువపత్రం, అడ్రస్ ప్రూఫ్. అంతే.. ఈ రెండింటితో ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
* మహిళ వయస్సు 18 సంవత్సరాలు మించి ఉండాలి.
* ఆమె తప్పనిసరిగా BPL కుటుంబానికి చెంది ఉండాలి.
* ఆమె వద్ద బిపిఎల్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి.
* దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యుల పేరిట ఎల్‌పిజి కనెక్షన్ ఉండకూడదు.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన దరఖాస్తును సమీప LPG పంపిణీ ఏజెన్సీలో దరఖాస్తు ఫారం నింపి సమర్పించవచ్చు. లేదా ఆన్‌లైన్ లో అధికారిక వెబ్‌సైట్ pmujjwalayojana.com కి వెళ్లి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని సమీప LPG సెంటర్‌లో సమర్పించాలి. దీంతో అర్హులకు ఉచిత గ్యాస్ కనెక్షన్, సిలిండర్, స్టవ్ లభిస్తాయి.