గూగుల్ మ్యాప్ లో కొత్త ఫీచర్.. పెట్రోల్, డీజిల్ తక్కువ ఖర్చయ్యే మార్గం!

మనం కొత్త ప్రాంతంలోకి వెళ్లినప్పుడు దారి తెలియకపోతే దేన్ని వాడుతాం.. హా ఇంకేంటి గూగుల్ మ్యాప్ ఉంది కదా అంటారా. అవును ఉంది. ఇందులో సెర్చ్ చేస్తే మనం ఉన్న దగ్గరి నుంచి లొకేషన్ వరకు తక్కువ టైమ్ లో చేరే దగ్గరి దారిని చూపిస్తుంది. అయితే ఇంధనం(పెట్రోల్/డీజిల్) తక్కువ ఖర్చు అయ్యే దారిని చూపిస్తే బాగుండు అనుకుంటున్నారు కదా.

త్వరలోనే ఈ సౌలభ్యం కూడా రాబోతోంది. నిజమండి. ప్రస్తుతం పెట్రోల్ లేదా డీజిల్ రేట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. సామాన్య జనం బైకు లేదా కారు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి వారికి గూగుల్ మ్యాప్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏ దారిలో వెళ్తే తక్కువ పెట్రోల్, డీజిల్ తో చేరుకోగలమో చూపించే అల్గారిథమ్ ను గూగుల్ డెవలప్ చేస్తోంది.

ఎంత టైమ్ ఆదా అవుతుందో చూపే బదులు కస్టమర్ కు ఎంత ఇంధనం ఆదా అవుతుందో అంచనా వేసి నేవిగేషన్ టూల్స్ చూపిస్తాయి. దీంతో మనం తక్కువ ఇంధనంతో ఆ రూట్లో వెళ్లొచ్చు. కానీ ఇంధనం తక్కువ అయ్యే రూట్ ఆప్షన్ (ఫ్యూయల్ ఎఫీషియంట్) ఆన్ చేసి ఉన్నప్పుడు.. వేగవంతమైన మార్గాలు చూపించవు. ఒక వేళ ఇవి మనం వాడితే ఫ్యూయల్ ఎఫీషియంట్ ఆప్షన్ చూపించదు. వీటితో పాటు ఇంతకు ముందు ఉన్న అన్ని ఆప్షన్లను కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. వినడానికి బాగుంది కదూ. అయితే దీనికి కాస్త టైమ్ పడుతుంది. ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.