సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం తమ యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. కొత్త అప్‌డేట్ వచ్చిన తరువాత యూజర్లు 4కే రిసొల్యూషన్ ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయవచ్చని సంస్థ ప్రకటించింది. దీంతో పాటు ఎక్కువ రిసొల్యూషన్ ఉండే వీడియోలను చూడవచ్చని ట్విట్టర్ వెల్లడించింది. కొంతమంది వినియోగదారులకు ఇప్పటికే ఈ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆప్షన్ కనిపిస్తే, దాన్ని యూజర్లు టెస్ట్ చేయవచ్చు. దీనికి సెట్టింగ్స్ ఆప్షన్స్‌లో కనిపించే ‘high quality images’ ప్రిఫరెన్సెస్‌ను మార్చుకోవాలి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగంలో డేటా యూసేజ్ ను ఎంచుకుంటే ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది.
ఈ హై క్వాలిటీ ఇమేజెస్ అప్‌లోడ్ సెట్టింగ్స్ డిఫాల్ట్‌గా ‘never’ అనే చూపిస్తుంది. దీన్ని ట్విట్టర్ యూజర్లు మాన్యువల్‌గా మార్చుకోవాలి. వినియోగదారులు తమ ప్రాధాన్యాన్ని బట్టి అప్‌లోడ్ చేసే ఇమేజ్‌లను డిఫాల్ట్‌గా లేదా హై రిసొల్యూషన్ ఇమేజ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు.
కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సింగిల్ ఇమేజ్‌ను ట్వీట్ చేసినప్పుడు.. అది టైమ్‌లైన్‌లో కనిపించినట్టుగానే ట్వీట్ కంపోజర్‌లలో కూడా కనిపిస్తుంది. కొంతమంది ట్వీట్‌తో పాటు స్టాండర్డ్ యాస్పెక్ట్ రేషియో ఉండే సింగిల్ ఇమేజ్‌ను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తారు. అలాంటప్పుడు ట్విట్టర్ ఇమేజ్‌ను క్రాప్ చేయకుండా ఒరిజినల్ క్వాలిటీతోనే పబ్లిష్ చేస్తుందని సంస్థ ప్రకటించింది. కానీ ఈ కొత్త ఫీచర్‌పై ట్విట్టర్ అధికారికంగా ధ్రువీకరించలేదు.
వినియోగదారులు సెండ్ బటన్ ను నొక్కిన తరువాత కూడా ట్వీట్ పోస్ట్ చేసే విషయంలో పునరాలోచించే అవకాశాన్ని ట్విట్టర్ కల్పించనుంది. దీనికి సంబంధించిన ‘undo’ ఫీచర్‌ను సంస్థ పరిశీలిస్తోంది. దీని వల్ల ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేయడానికి ముందు ఒక ట్వీట్‌ను వెనక్కి తీసుకునే లేదా సరి చేసే అవకాశం కలుగనుంది. ’ట్వీట్’ బటన్ ను నొక్కిన తరువాత కంటెంట్ కింద బ్లూ కలర్లో ‘undo’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ట్వీట్ పోస్ట్ కావడానికి కొన్ని సెకన్లకు ముందు ఈ బటన్ పై నొక్కి ట్వీట్‌ను వెనక్కి తీసుకోవచ్చు.