మనం రోజు వాడే నూనెలు, షాంపూలు, బిస్కెట్ల ధరలు ఇకపై పెరగనున్నట్లు సంబంధిత కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ధరలు 4–5 శాతం వరకు పెంచేలా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు కసరుత్తులు చేస్తున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ముడి పదార్థాల వ్యయం పెరగడమేనని ఆయా కంపెనీల అభిప్రాయం. మారికోతో పాటు పలు కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరల పెంపును ధ్రువీకరించాయి. పతాంజలి, డాబర్, పార్లే, తదితర సంస్థలు సైతం ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
కొబ్బరి నూనె, టీ, పామాయిల్, వంట నూనె, వంటి ముడి వస్తువుల ధరలు క్రమ క్రమంగా పెరుగుతున్నా, ఇప్పటివరకు భరించామని.. ఇక స్థూల మార్జిన్లపై (లాభాలపై) ప్రభావం పడే పరిస్థితి ఏర్పడినందున ధరలు పెంచాలనే యోచన చేస్తున్నాయి. ‘గత 3–4 నెలల్లో వంట నూనెల ధరలు బాగా పెరిగాయి. దీంతో మా ఖర్చులు భారీగా పెరిగి, మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మేము భారీగా నష్టపోతామని దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి వస్తుంద’ని పార్లే ఉత్పత్తుల సీనియర్ విభాగ హెడ్ మయాంక్ షా వెల్లడించారు. పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా, డాబర్ ఇండియా సీఎఫ్‌ఓ లలిత్‌మాలిక్, కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పటికి పలు కంపెనీలు తమ మార్జిలపై నిర్ణిత ధరలను పెంచాయి.