దక్షిణ మధ్య రైల్వే తాజాగా ‘రైల్ మదద్’ పేరిట ఓ నూతన యాప్‌ను తన జోన్ పరిధిలోని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణంలో ఎంత మజా ఉంటుందో.. ఏదైనా ఇబ్బంది ఎదురైతే అంతే అవస్థ పడాల్సి వస్తుంది. ఎవరికి చెప్పాలో, ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వాలో తెలియదు. దీంతో చాలా మంది ప్రయాణికులు అడ్జస్ట్ అయి రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే తన జోన్ పరిధిలోని ప్రయాణికులకు ఓ నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. ప్రయాణికులకు రైలు ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆ యాప్‌లో ఫిర్యాదు చేసి తగిన పరిష్కారం పొందవచ్చు.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా ‘రైల్ మదద్’ పేరిట ఓ నూతన యాప్‌ను తన జోన్ పరిధిలోని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే రైలు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలకు ప్రయాణికులు వెంటనే పరిష్కారం పొందవచ్చు. ఈ క్రమంలో ప్రయాణికులు తమకు ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేయాలి. దీంతో ఆ ఫిర్యాదుకు చెందిన ఎస్ఎంఎస్ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు అందుతుంది. వారు స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కింది స్థాయి రైల్వే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో సమస్య సకాలంలో పరిష్కారం అవుతుంది.
అయితే ఈ యాప్ ద్వారా కేవలం సాధారణ ప్రయాణికులే కాదు, మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా తమ రక్షణకు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. ఈ యాప్ లో కేవలం ఫిర్యాదులు మాత్రమే కాదు, ప్రయాణికులు తాము ఉన్న ప్రదేశానికి చెందిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. అయితే ప్రయాణికులు చేసిన ఫిర్యాదుకు గాను ఒక యూనిక్ ఐడీ క్రియేట్ అవుతుంది. దాంతో సమస్య పరిష్కారం స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇక రైలు ప్రయాణంలో ప్రయాణికులు తమకు ఎదురయ్యే దాదాపు 20 రకాల సమస్యలకు చెందిన ఫిర్యాదులను యాప్‌లో పంపించవచ్చు. ప్రయాణించేటప్పుడు 15 రకాల ఫిర్యాదులను ఈ యాప్ స్వీకరిస్తుంది..!