తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు… దీన్ని వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు పెన్షన్ వయస్సు 65 ఏళ్లు ఉండగా ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. ఈ వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంటుంది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. వారు సమాజంలో గౌరవంగా బతికేలా చేయూతనందిస్తోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వద్ధాప్య పింఛన్ అర్హత వయసును తగ్గించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో మరికొంత మంది జీవితాల్లో ఆనందం కనిపించనుంది. ఇప్పటికే అనేక కుటుంబాలు కరోనా నేపథ్యంలో ఆసరాను కోల్పోయాయి. వృద్ధాప్య పెన్షన్ వారికి కనీస అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది.