టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి నూతన కేబుల్ చార్జిల విధానం అమలులోకి వచ్చిన విషయం విదితమే. కాగా కొత్త విధానం ప్రకారం అనేక పే చానల్స్ వసూలు చేస్తున్న చార్జిలు స్వల్పంగా పెరిగాయి. వినియోగదారులు తమకు నచ్చిన చానల్స్ మాత్రమే ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే చార్జిలు చెల్లించే విధంగా ఒక స్థిరమైన ప్లాట్‌ఫాం ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయగా ఆ ప్రకారమే నూతన విధానం ప్రస్తుతం అమలులో ఉంది. అయితే దేశ వ్యాప్తంగా ఆయా కేబుల్ నెట్‌వర్క్‌ల పరిధిలలో సుమారుగా 400 చానల్స్‌ను ప్రస్తుతం వీక్షకులు చూస్తున్నారు. వాటిల్లో తమకు నచ్చిన చానల్స్‌ను వారు వీక్షిస్తున్నారు. ఇక తెలుగు చానల్స్ విషయానికి వస్తే.. నూతన విధానం ప్రకారం ఆయా చానల్స్ అందిస్తున్న ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్ లో 7 తెలుగు చానల్స్ వస్తాయి. రూ.24 నెలకు చెల్లించాలి. జెమినీలో 7 తెలుగు చానల్స్ వస్తాయి. రూ.30 చెల్లించాలి. అలాగే స్టార్ మా ప్యాకేజీకి రూ.39 (7 తెలుగు, 3 ఇతర భాషా చానల్స్), జీ తెలుగు ప్యాకేజీకి రూ.20 (2 తెలుగు, 7 ఇతర భాషా చానల్స్) నెలకు చెల్లించాలి. వీటికి మొత్తం రూ.113 అవుతుంది. దీనికి రూ.20.34 జీఎస్‌టీ చెల్లించాలి. ఇక వీటితోపాటు ఫ్రీ టు ఎయిర్ చానల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇవన్నీ కచ్చితంగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130 లో వస్తాయి.
రూ.130 బేసిక్ ప్రీమియం ప్యాకేజీకి అయినా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. దీంతో ట్యాక్స్‌తో కలిపి అది రూ.155 అవుతుంది. ఇక పైన చెప్పిన విధంగా ఆయా చానల్స్‌కు చెందిన ప్యాకేజీలను ఎంపిక చేసుకుంటే నెలకు రూ.285 నుంచి రూ.300 అవుతుంది. ఇక ఇవి కాకుండా ఇంగ్లిష్, హిందీ భాషలకు చెందిన ఎస్డీ, హెచ్‌డీ చానల్స్ వీక్షించాలంటే అందుకు ప్యాకేజీ లేదా అలాకార్ట్ ప్రకారం విడివిడిగా చానల్స్‌ను ఎంపిక చేసుకుని వీక్షించవచ్చు. ఈ క్రమంలో గతంలో ఉన్న కేబుల్ చార్జిల కన్నా వీక్షకులకు సుమారుగా రూ.70 నుంచి రూ.100 వరకు అదనంగా డబ్బులు ఖర్చవుతాయి. అయినప్పటికీ ప్రేక్షకులు కేవలం తాము ఎంపిక చేసుకున్న చానల్స్ ను మాత్రమే చూసే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే స్వేచ్ఛ ఇప్పుడు వారికి అందుబాటులో ఉంది. అయితే కేబుల్ చార్జిల విధానంలో తెచ్చిన మార్పులపై మాత్రం పలువురు పెదవి విరుస్తున్నారు. పాత విధానమే సరిగ్గా ఉందని చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక ముందు ముందు కేబుల్ చార్జిలు తగ్గితే తప్ప ప్రేక్షకులకు లాభం కలిగే అవకాశాలు కనిపించడం లేదు..!