ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాలి.. లేఖ‌ల‌తో పోరాటం చేస్తున్న 11 ఏళ్ల బాలుడు..!

-

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌.. ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌కు సంక్షిప్త రూపం ఇది. ప్ర‌స్తుతం ఈ గేమ్ దేశంలో అంద‌రినీ ఒక ఊపు ఊపుతోంది. పిల్ల‌లు, యువ‌త పెద్ద ఎత్తున ఈ గేమ్‌ను ఆడుతున్నారు. ఎక్క‌డ చూసినా ఈ గేమ్ ఆడేవారే ప్ర‌స్తుతం మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌బ్‌జి మొబైల్ గేమ్ కు చాలా మంది బానిస‌ల‌వుతున్నారు. చుట్టూ ఉన్న వారిని ప‌ట్టించుకోకుండా, తిండి, నిద్ర లేకుండా, ఎడా పెడా ఈ గేమ్‌ను ఆడుతుండ‌డంతో చాలా మందిలో మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్‌లో ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఆడడాన్ని నిషేధించారు కూడా. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఇదే త‌రహాలో చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ గేమ్ ను దేశ వ్యాప్తంగా బ్యాన్ చేయాల‌ని ఓ 11 ఏళ్ల కుర్రాడు పోరాటం ప్రారంభించాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ముంబైలోని బాంద్రా అనే ప్రాంతంలో నివాసం ఉండే అహ‌ద్ నిజామ్ (11) 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ బాలుడు గ‌తంలో ఓసారి ప‌బ్‌జి మొబైల్ ఆడాడ‌ట‌. దీంతో త‌న‌కు నెగెటివ్ ఆలోచ‌న‌లు పెరిగి, మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ట‌. ఈ క్ర‌మంలోనే అత‌ను వెంట‌నే గేమ్‌ను ఆడ‌డం మానేశాడ‌ట‌. అయితే ఈ గేమ్ వ‌ల్ల పిల్ల‌లు, యువ‌తలో మాన‌సిక స‌మ‌స్య‌లు పెర‌గ‌డంతోపాటు వారిలో హింసాత్మ‌క ధోర‌ణి పెరుగుతుందని అత‌ను చెబుతున్నాడు. అందుకే ఈ గేమ్‌ను బ్యాన్ చేయాల‌ని అత‌ను ప్ర‌స్తుతం పోరాటం చేస్తున్నాడు.

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను దేశంలో బ్యాన్ చేయాల‌ని అహ‌ద్ నిజామ్ తాజాగా లేఖ‌లు రాశాడు. త‌న త‌ల్లి స‌హాయంతో అత‌ను కేంద్ర ప్ర‌భుత్వం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, విద్యాశాఖ, కేంద్ర ఐటీ శాఖ మంత్రుల‌కూ నిజామ్ లేఖ‌లు రాశాడు. అలాగే పబ్‌జి గేమ్ సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్ సీఈవోకు, మైక్రోసాఫ్ట్ కంపెనీకి కూడా నిజామ్ లేఖ‌లు రాశాడు. ప‌బ్‌జి మొబైల్ గేమ్ వ‌ల్ల అనేక మందిలో వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ అత‌ను జ‌న‌వ‌రి 25వ తేదీన లేఖ‌లు రాయ‌గా, ఇంకా వారి నుంచి స్పంద‌న రాలేదు. అయితే ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాల‌ని ఒక బాలుడు చేస్తున్న పోరాటానికి స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి స్పంద‌న ల‌భిస్తున్న‌ట్లు తెలిసింది. దీంతో వారు ఆ బాలుడితో క‌ల‌సి కోర్టులో పిల్ వేయ‌నున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా ప‌బ్‌జి మొబైల్ గేమ్ సృష్టిస్తున్న మాయ అంతా ఇంతా కాదు. నిద్రాహారాలు మాని ఆ గేమ్‌లో మునిగిపోతున్న యువ‌త‌, పిల్ల‌ల ఆరోగ్యం, కెరీర్ దృష్ట్యా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు, విద్యావేత్త‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. చూద్దాం మ‌రి.. ఏమ‌వుతుందో..!

Read more RELATED
Recommended to you

Latest news