ఉత్త‌రాంధ్ర‌కు తుఫాను ముప్పు

-

Titli Cyclone Alert To North Andhra
విశాఖపట్నం : ఉత్తరాంధ్రకు తీవ్ర తుఫాను ముప్పు పొంచి ఉందని, ‘టిట్లీ’ తుఫాను మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం.. కళింగపట్నానికి ఆగ్నేయంగా 270కి.మీ, గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 320కి.మీల దూరంలో ఈ తీవ్ర తుఫాను కేంద్రీకృతమైఉంది. బుధ‌వారం సాయంత్రంలోగా అతి తీవ్ర తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. ఒడిస్సా, ఉత్తరాంధ్రకు ఆనుకుని గోపాల్‌పూర్‌- కళింగపట్నం మధ్య గురువారం ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 110 నుంచి 135 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. బుధ‌వారం సాయింత్రం నుంచి గురువారం ఉదయంలోగా దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్రకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో 140 నుంచి 165 కి.మీ వేగంతో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది.

సముద్రపు అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉండటంతో శ్రీకాకుళం, ఒడిస్సాలోని గంజాం, ఖుర్దా, పూరీ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పక్కా ఇళ్లకు నష్టం వాటిళ్లవచ్చని, కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడవచ్చని అంచనావేస్తున్నారు. చెట్లు కూకటివేళ్ళత్తో సహా పడిపోయే అవకాశముందని, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లె ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ కాగా మిగిలిన అన్ని పోర్టుల్లో 2వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news