కోవిడ్ 19 యాంటీబాడీస్ టెస్టు. దీన్నే సెరోలజీ పరీక్ష అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తిలో కోవిడ్ 19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌కు చెందిన యాంటీ బాడీలు ఉన్నాయో లేదో గుర్తించేందుకు యాంటీ బాడీస్ టెస్టు చేస్తారు. ఈ టెస్టు వల్ల ఒక వ్యక్తికి కోవిడ్ సోకిందా, లేదా అన్న వివరాలు తెలుస్తాయి. సాధారణంగా కొందరికి కోవిడ్ వచ్చి పోతుంది. ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. కానీ వారి వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. అదే వారు యాంటీ బాడీల పరీక్ష చేయించుకుంటే వారిలో కోవిడ్ 19కు చెందిన యాంటీ బాడీలు ఉంటాయి. కనుక వారికి కోవిడ్ ఉందీ, లేనిదీ నిర్దారించవచ్చు. దీంతో కోవిడ్ వచ్చి కూడా లక్షణాలు లేని వారిని సులభంగా గుర్తించవచ్చు. దీని వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
ప్రస్తుతం అనేక రకాలుగా యాంటీ బాడీల టెస్టులు చేస్తున్నారు. అయితే అన్ని యాంటీ బాడీ పరీక్షలను ఎఫ్డీఏ ఇంకా అనుమతించలేదు. అందువల్ల ఆ పరీక్షల గురించి వివరాలను తెలుసుకుని మరీ వాటిని చేయించుకోవాల్సి ఉంటుంది.
యాంటీబాడీస్ అంటే ఏమిటి ?
మన శరీరంలో ఏవైనా వైరస్‌లు ప్రవేశిస్తే వాటిని నిర్మూలించడం కోసం రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీలను తయారు చేస్తుంది. అంటే యాంటీ బాడీలు వైరస్‌లను నాశనం చేస్తాయన్నమాట. దీంతో వైరస్‌ల బారి నుంచి మన శరీరానికి రక్షణ లభిస్తుంది. యాంటీ బాడీలు ప్రోటీన్ల జాబితాకు చెందుతాయి. ఈ క్రమంలోనే SARS-CoV-2 (COVID-19) వ్యాప్తి చెందిన తరువాత శరీరంలో సహజంగానే యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే అవి ఉత్పత్తి అయ్యేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పడుతుంది. ఇక యాంటీ బాడీలు రక్తంలో ఎన్ని రోజుల వరకు ఉంటాయో కూడా తెలియదు. దీనిపై వివరాలు సరిగ్గా లేవు. ఇక లక్షణాలు లేకుండా కోవిడ్ వచ్చిపోయే వారిలో యాంటీ బాడీలు ఉంటాయి. కానీ కోవిడ్ వచ్చినట్లు తెలియకపోతే ఏమీ చేయలేము. కాకపోతే యాంటీ బాడీల టెస్టు చేయించుకుంటే కోవిడ్ ఉందీ, లేనిదీ ఒక అంచనా వేయవచ్చు.
యాంటీ బాడీల టెస్టుతో కోవిడ్‌ను నిర్దారించవచ్చా ?
ఈ విషయాన్ని సరిగ్గా చెప్పలేము. కొన్ని సార్లు రిపోర్టు నెగెటివ్ రావచ్చు. కానీ పాజిటివ్ వస్తే కోవిడ్ ఉందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సాధారణ జలుబు వల్ల కూడా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అలాంటి సమయంలో టెస్టు చేస్తే యాంటీ బాడీలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అవి కోవిడ్ వల్ల ఉత్పత్తి అయ్యాయా, ఇతర అనారోగ్య సమస్యల వల్లా.. అన్న వివరాలు తెలియవు.
ఇక ప్రస్తుతం కోవిడ్‌ను నిర్దారించేందుకు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. మొదటిది ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు. రెండోది ఆర్‌టీ పీసీఆర్ టెస్టు. ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులో పాజిటివ్ లేదా నెగెటివ్ ఏది వచ్చినా ఆర్‌టీ పీసీఆర్ టెస్టును కచ్చితంగా చేయించుకోవాలి. కొన్నిసార్లు ర్యాపిడ్ టెస్టులో ఫలితం కచ్చితంగా రాదు. కనుక ఆర్‌టీ పీసీఆర్ టెస్టును చేయించుకోవాలి. ఇక యాంటీ బాడీస్ టెస్టు కోసం రక్త పరీక్ష చేస్తారు.
యాంటీ బాడీస్ టెస్టులో పాజిటివ్ వచ్చిందంటే కోవిడ్ వచ్చి పోయిందని నిర్దారించుకోవాలి. వ్యక్తికి జలుబు, ఇతర వైరస్‌లతో వచ్చే వ్యాధులు లేకపోతే ఆ యాంటీ బాడీస్ కోవిడ్ వల్లే వచ్చాయని అంచనాకు రావాలి. ఇక కొన్ని సార్లు యాంటీ బాడీస్ టెస్టులో నెగెటివ్ వస్తుంది. అంత మాత్రం చేత శరీరంలో యాంటీ బాడీస్ లేవని కాదు. టెస్టులో లోపం ఉందని లేదా కోవిడ్ యాంటీ బాడీలు సరిగ్గా ఉత్పత్తి కాలేదని లేదా కోవిడ్ అసలు సోకలేదని తెలుసుకోవాలి. ఇలా యాంటీ బాడీస్ టెస్టులు పనిచేస్తాయి.
అయితే యాంటీ బాడీస్ టెస్టులు భిన్న దేశాల్లో భిన్న రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే అవసరం అనుకుంటే వీటిని చేయించుకోవచ్చు. దీని వల్ల యాంటీ బాడీస్ ఉన్నాయా, కోవిడ్ వచ్చి పోయిందా, రాలేదా వంటి వివరాలు ప్రాథమికంగా తెలుస్తాయి. దీని వల్ల కోవిడ్ వ్యాప్తి జరగకుండా చూడవచ్చు.