రాజకీయ తెరపైకి కొత్త నేతలు.. సరికొత్త పార్టీలు

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 2021 హాట్‌హాట్‌గా నిలిచింది. వైఎస్సార్‌టీపీ అనే కొత్త పార్టీ ఆవిర్భవించగా, ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాడు. పార్టీ స్థాపించిన నాటి నుంచే వైఎస్ షర్మిళ పరామర్శలు, పాదయాత్రలతో హడావుడి మొదలు పెట్టారు. అధికార పార్టీపై పదునైన విమర్శలతో బహుజన రాజ్యం సాధర పేరిట ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మొత్తం చుడుతున్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ వైఎస్ షర్మిళ తెలుగు రాష్ట్రాలలో సుపరిచితురాలు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకే పరిమితమైన ఆమె.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే క్రమేణా తెరమరుగయ్యారు. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు వైఎస్ షర్మిళ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని బలమైన ప్రతిపక్షం లేదంటూ పార్టీ స్థాపనను ప్రకటించారు. 2021, జూలై 8న వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు.

వైఎస్‌ఆర్ టీపీ స్థాపించిన మొదటి రోజు నుంచే సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ‘జాబ్ నోటిఫికేషన్ల’ సమస్యను భుజానికెత్తుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించారు. ప్రతి మంగళవారం జాబ్ నోటిఫికేషన్ల కోసం ఒకరోజు దీక్షలను మొదలు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలను నేరుగా కలుసుకోవడం కోసం పాదయాత్రను మొదలు పెట్టారు.

‘బహుజనులకు రాజ్యాధికారం’ అనే నినాదంతో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ ఏడాదిలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1995లో ఐపీఎస్ అధికారిగా ఎంపికైన 2021లో స్వచ్ఛందంగా పదవీ విమరణ తీసుకున్నారు. గురుకులాల కార్యదర్శి పదవికి 2021, జూలై 19న రాజీనామా చేశారు. సోషల్ వెల్ఫేర్‌లో తనదైన ముద్ర వేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్ రాజకీయాలలో కూడా సత్తా చాటడానికి 2021, ఆగస్టు 9న మాయావతి సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.

‘దళితులు, బహుజనులు రాజ్యాధికారం కోసం కృషి చేయాలి’ ఇదీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నినాదం. బీఎస్పీలో చేరిన నాటి నుంచి రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలపైన విమర్శలను సంధిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారు. విద్యార్థులను, యువతీ యువకులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ కేంద్రంగా నడుస్తున్న రాజకీయ తెరమీదికి కొత్తగా వైఎస్‌ఆర్‌టీపీ, బీఎస్పీలు వచ్చాయి. యువ నాయకత్వం ఉండటం, దూకుడుగా వ్యవహరిస్తూ ఆ మూడు పార్టీలకు పోటీగా నిలిచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రానున్న ఏడాదిలో వైఎస్ షర్మిళ, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఏ మేరకు సత్తా చాటుతురో వేచి చూడాల్సిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news