కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలో హోం లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకున్న వారు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మే 31వ తేదీ వరకు మారటోరియం సదుపాయం కల్పించిన విషయం విదితమే. అయితే ఈ సదుపాయాన్ని మరో 3 నెలల వరకు పొడిగించాలని ఆర్‌బీఐ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దేశంలో లాక్‌డౌన్ మే 31వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో జూన్ నెలలో ఎవరూ ఈఎంఐలను చెల్లించే పరిస్థితిలో లేరు. అందుకనే ఆర్‌బీఐ మారటోరియం సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఆర్‌బీఐ మారటోరియం సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగిస్తే.. జూన్, జూలై, ఆగస్టు.. నెలల్లో ఈఎంఐ, బిల్లు చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. తిరిగి సెప్టెంబర్‌లో వాటిని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాటికి అదనంగా వడ్డీ కూడా పడుతుంది. అయితే ఆర్‌బీఐ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నా.. తన నిర్ణయం చెప్పేందుకు మరికొద్ది రోజులు పట్టేందుకు అవకాశం ఉందని తెలిసింది.
ఇప్పటికే దేశంలో ఎంతో మందికి ఉపాధి పోయింది. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి కూడా ఆర్థిక సమస్యలు విపరీతంగా వచ్చిపడ్డాయి. ఇలాంటి తరుణంలో మారటోరియం సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగిస్తేనే మంచిదనే ఉద్దేశంలో ఆర్‌బీఐ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై మరికొద్ది రోజులు ఆగితే కానీ స్పష్టత రాదు.